ఆళ్లపల్లి, ఆగస్టు 21 : మాజీ ఉప సర్పంచ్, కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మర్కోడు మాజీ ఉప సర్పంచ్ కమల చేసిన రోడ్డు పనులకు పర్సంటేజీగా ఎంపీవో బత్తుల శ్రీనివాస్, మర్కోడు పంచాయతీ కార్యదర్శి తాటి నాగరాజు లంచం డిమాండ్ చేశారు.
దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన ఆమె పరిస్థితిని వివరించారు. వారి సూచన మేరకు ఎంపీవో, పంచాయతీ కార్యదర్శికి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో రూ.15 వేలు లంచం ఇస్తుండగా.. అప్పటికే మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా వారిని పట్టుకుని అరెస్ట్ చేశారు. దాడుల్లో ఏసీబీ సీఐలు రాజశేఖర్, మల్లేశ్, రాజు, ఆళ్లపల్లి ఎస్సై సతీశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.