భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసి.. ఢిల్లీ పెద్దలను గడగడలాడించిన తెలంగాణ సాధకుడు కేసీఆర్ అని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వద్దిరాజు మాట్లాడారు.
ఆనాడు కేసీఆర్ పట్టుదలతో దీక్ష చేయకపోతే ఈనాడు మనం తెలంగాణ రాష్ర్టాన్ని చూసే వాళ్లం కాదన్నారు. అటువంటి నాయకుడిని కొందరు కాంగ్రెస్ మూర్ఖులు ఆనవాళ్లు లేకుండా చేస్తామని అనడం సిగ్గు చేటన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ జిల్లా ఇన్చార్జి నాయకత్వంలో దీక్షా దివస్ సందర్భంగా కొత్తగూడెంలో శుక్రవారం భారీ ర్యాలీ ఉంటుందని అన్నారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ అంటేనే కేసీఆర్ అని అన్నారు. పార్టీ నేతలు పాల్గొన్నారు.