ఖమ్మం, ఆగస్టు 28 : జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత, దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ మాజీ చైర్మన్ డాక్టర్ వాసుదేవరెడ్డి తదితర ప్రముఖులు పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి కవిత విడుదల పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఖమ్మం, ఆగస్టు 28 : ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై బీఆర్ఎస్ మాజీ లోక్ సభాపక్ష నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టులో న్యాయవాదులు రాజకీయ పార్టీల తరపున కాదు.. న్యాయసూత్రాల ఆధారంగా వాదిస్తారని ఆయన పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవితపై లేనిపోని ఆరోపణలు చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నించినా.. అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంపై సత్యం ఎప్పుడూ గెలుస్తుందనేది సాక్షాత్కరింపజేసిందన్నారు. ఆమె రాష్ట్ర ప్రజల కోసం అంకితభావంతో పని చేసిన నాయకురాలని, తెలంగాణోద్యమంలో సాంస్కృతిక పరంగా కీలక పాత్ర పోషించారని నామా గుర్తు చేశారు.
ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 28 : ఎమ్మెల్సీ కవిత కేసులో చివరకు న్యాయమే గెలిచిందని, ఆమెకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషకరమైన విషయమని కువైట్ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ పేరుతో తెలంగాణ అడబిడ్డ, ఎమ్మెల్సీ కవితపై ఈడీ అక్రమ కేసులు బనాయించిందని తెలిపారు. ఎలాంటి ఆధారాలు చూపకుండా దాదాపు 5 నెలలపాటు జైలులో ఉంచారని, కోర్టుకు సైతం ఒక్క ఆధారం సమర్పించలేదని ఆమె పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే కవితను జైలుకు పంపించారని, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఆమెకు బెయిల్ మంజూరు కావడం మంచి పరిణామమన్నారు.
మధిర, ఆగస్టు 28 : అక్రమ కేసులతో బీఆర్ఎస్ శ్రేణులను ఎవరూ బెదిరించలేరని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్‌రాజు అన్నారు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడాన్ని హర్షిస్తూ మధిర పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి బుధవారం ఆయన బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంతో న్యాయం తమవైపే ఉన్నట్లు తేలిందన్నారు. కొంచెం ఆలస్యమైనా న్యాయం తప్పకుండా గెలుస్తుందనే విశ్వసం తమకు ఉందన్నారు.
బీఆర్ఎస్ నాయకులకు కేసులు, జైళ్లు కొత్తేమీ కాదని, నిరంతరం తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, పార్టీ మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్‌రెడ్డి, పట్టణ కార్యదర్శి అరిగె శ్రీనివాసరావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అప్పారావు, రైతు నాయకులు చావా వేణుబాబు, వీరారెడ్డి, పూర్ణచంద్రరావు, జేవీ రెడ్డి, శివాలయం కమిటీ మాజీ చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు, సత్యనారాయణరెడ్డి, కోటిరెడ్డి, మాజీ సర్పంచ్ బుర్రి బాబు, నాగేశ్వరరావు, చిప్పగిరి ప్రసాద్, ఆళ్ల నాగబాబు, నరసింహారావు, కొండ, చీరాల రాంబాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.