కారేపల్లి, ఏప్రిల్ 13: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం డోర్నకల్-భద్రాచలం రోడ్ రైల్వే లైన్లో ఖమ్మం- ఇల్లెందు ప్రధాన రహదారి గాంధీపురం వద్ద ఉన్న రైల్వే గేట్‌ను ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి ఆదివారం పరిశీలించారు. ఖమ్మం నుంచి ఇల్లెందు వైపు వెళుతున్న ఎంపీ రైల్వే గేటు పడటం వల్ల కొద్ది అక్కడ ఆగి రైల్వే సిబ్బందితో మాట్లాడారు.
ఖమ్మం-ఇల్లెందు మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని తరుచుగా గేటు పడటం వల్ల వాహనదారులు, ప్రయాణికులకు తీవ్ర అంతరాయం కలుగుతుందని స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా అత్యవసర వైద్యం కోసం రోగులు, క్షతగాత్రులను తరలించే ఆంబులెన్స్‌లు కూడా గేటు పడటం వల్ల ఎక్కువ సమయం నిలిచిపోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ రైల్వే మార్గంలో నిత్యం నడిచే రైళ్ల సంఖ్య, రోడ్డు మార్గం గుండా వెళ్లే వాహన రద్దీ గురించి రైల్వే సిబ్బందిని ఆడిగి తెలుసుకున్నారు. దక్షిణ మధ్య, కేంద్ర రైల్వేశాఖ అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని స్థానికులకు ఎంపీ చెప్పారు.