మధిర, ఏప్రిల్ 2: పార్టీ అధినేత కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎర్రుపాలెం మండలం జమలాపురంలోని రెడ్డి కల్యాణ మండపంలో ఆదివారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు అధ్యక్షతన నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాతే ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ విజన్‌తోనే అది సాధ్యమైందన్నారు. రైతు పక్షపాతిగా సీఎం రైతులకు రైతుబంధు అందిస్తున్నారన్నారు. జిల్లా అభివృద్ధికి ఇప్పటివరకు 50 వేల కోట్లు కేటాయించారన్నారు.
కొందరు స్వార్థ నాయకులు రాజకీయాల లబ్ధి కోసం సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని, మరోసారి కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదన్నారు. రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, వారు రాష్ర్టాభివృద్ధి గురించి ఏనాడూ పార్లమెంట్లో మాట్లాడలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపుతో రాష్ర్టానికి నిధులు కేటాయించడం లేదని మండిపడ్డారు. రాజ్యసభ సభ్యుడు పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త, నాయకుడు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. అంతర్గత సమస్యలను సమన్వయంతో పరిష్కరించుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా సీఎం కేసీఆర్ నియోజకవర్గాలకు సీఎం కేసీఆర్ నిధులు కేటాయిస్తున్నారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్నారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతం కోసం పనిచేయాలన్నారు. ప్రజాసమస్యలకు పరిష్కారం చూపినప్పుడే కార్యకర్తకైనా, ప్రజాప్రతినిధులకైనా గుర్తింపు వస్తుందన్నారు. ప్రజలతో మమేకమైతేనే ప్రజలు మనల్ని ఆదరిస్తారన్నారు. కార్యకర్తలు, నాయకుల బాగోగులు తెలుసుకునేందుకే పార్టీ అధిష్ఠానం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నదన్నారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని అందరూ శిరోధార్యంగా తీసుకోవాలన్నారు. సొంతపార్టీకి వెన్నుపోటు పొడిచి, ఆ పార్టీనే విమర్శించే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నైతిక విలువలు లేవన్నారు. 2014 నుంచి 2018 వరకు పొంగులేటి ఎంపీగా ఉన్నారని, ఆ సమయంలో జిల్లా అభివృద్ధి కోసం ఏమీ చేశారో ప్రజలకు తెలియజేయాలన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అంటే ఒక కుటుంబం అని, కలిసి మెలిసి ఉంటే మున్ముందు అనేక విజయాలు సాధించవచ్చన్నారు. ప్రతి గ్రామంలో 20 నుంచి 30 మంది నాయకులు పార్టీ కోసం పనిచేస్తున్నారని, వారంతా ప్రజల మన్ననలను చూరగొనాలన్నారు. సీఎం కేసీఆర్ కృషితోనే రాష్ట్రంలో వ్యవసాయం పండుగైందన్నారు.
కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ.. నియోజకవర్గవ్యాప్తంగా పార్టీకి 50 వేల సభ్యత్వాలు ఉన్నాయని, ప్రతి గ్రామంలో 70 మంది పార్టీ అనుబంధ సంఘాలకు చెందిన సభ్యులు ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో విజయబావుటా ఎగుర వేయాలన్నారు. పార్టీ నాయకుడు బొమ్మెర రామ్మూర్తి మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పనిచేయడం లేదన్నారు. ఈ సారి ఎమ్మెల్యే స్థానాన్ని బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు.
రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు బోనకల్లు మండలంలో పంటలు దెబ్బతిన్నప్పుడు సీఎం కేసీఆరే స్వయంగా వచ్చి పంటలను పరిశీలించారని, బాధితులకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. రైతు ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటయ్యేందుకు ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ ఎర్రుపాలెం మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, ఎంపీపీ దేవరకొండ శిరీష, ఆత్మ కమిటీ చైర్మన్ గుర్రం రామారావు, నాయకులు చావా రామకృష్ణ, చిత్తారు నాగేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు పాల్గొన్నారు.