కూసుమంచి (నేలకొండపల్లి), నవంబర్ 16: తెలంగాణలో మూడోసారీ కేసీఆరే ముఖ్యమంత్రి అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అద్భుతమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనేత నంబర్ వన్‌గా నిలిపిన ఘనత ఆయనదేనని తేల్చిచెప్పారు. నేలకొండపల్లి మండలంలో గురువారం పర్యటించిన ఆయన.. ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్లతో కలిసి బోదులబండ, చెన్నారం, మండ్రాసుపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీరు, తాగునీరు విద్యుత్, విద్య, వైద్య రంగాలతోపాటు మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉందని వివరించారు.
ప్రజలందరూ ఈ అభివృద్ధిని గమనించి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికీ అందాయని అన్నారు. వారంతా బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని అన్నారు. ప్రజలంతా తనకు మద్దతుగా నిలవాలని కోరారు. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు డాక్టర్ చంద్రావతి, తాళ్లూరి జీవన్, మరికంటి ధనలక్ష్మి, యాతాకుల భాస్కర్, ఉన్నం బ్రహ్మయ్య, నంబూరి శాంత, లీలా ప్రసాద్, నాగుబండి శ్రీనివాసరావు, నర్సింహారావు, సైదిరెడ్డి పాల్గొన్నారు.