ఖమ్మం, మే 3: అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఖమ్మం పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం, నాయకులు, కార్యకర్తల కృషితో సాధించబోయే మన విజయం చరిత్రలో నిలిచిపోవాలని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ భవన్లో కార్పొరేషన్‌లోని వివిధ డివిజన్ల స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ గెలుపులో కార్యకర్తలదే ప్రధానపాత్ర అన్నారు. నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కోరారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ సారథ్యంలో కేవలం పదేండ్లలోనే వందేండ్ల అభివృద్ధిని సాధించుకున్నామన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన ఉచిత హామీలు, అమలు వీలుకాని వాగ్దానాలను ప్రజలు నమ్మి నిలువునా మోసపోయారని అన్నారు. సంక్షేమ పథకాలు అమలుకావాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ గెలుపు కాంగ్రెస్‌కు గుణపాఠం కావాలన్నారు.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం ప్రజలు చరిత్రను తిరగరాయనున్నారని అన్నారు. నామా గెలుపు కోసం ప్రతి బూత్‌లెవల్ కమిటీ సభ్యుడు గడపగడపకూ వెళ్లి ఓట్లను అభ్యర్థించాలన్నారు. నామాకు ఖమ్మం నియోజవర్గంలోనే అత్యధిక మెజార్టీ వస్తుందన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ జిల్లా ప్రయోజనాల కోసం తనదైన స్థాయిలో పార్లమెంట్ వేదికగా కృషిచేసిన వ్యక్తి నామా అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక అతితక్కువ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరిగిందన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ప్రతి కార్యకర్త నామా గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో కొట్లాడిన వ్యక్తి నామా అన్నారు. ఖమ్మం గెలుపు కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్ కర్నాటి కృష్ణతోపాటు పలువురు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పాల్వంచ, మే 3: శాసనసభ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విమర్శించారు. పాల్వంచలో శుక్రవారం జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ సారథ్యంలో పదేళ్ల కాలంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేసిందన్నారు. తెలంగాణను సస్యశామలం చేసి.. రెండు పంటలు పండేలా చేసిన రాష్ర్టాన్ని అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కోలుకోకుండా చేసిందన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయారని, ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసపోవద్దన్నారు. నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల పరిశీలకుడు వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు మంతపురి రాజుగౌడ్, కిలారు నాగేశ్వరరావు, మల్లెల రవిచంద్ర, విశ్వనాథం, శ్రీరాంమూర్తి, మడి సరస్వతి, సింధుతపస్వీ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపును కాంక్షిస్తూ ఆ పార్టీ నాయకులు శుక్రవారం సత్తుపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 5వ వార్డులో ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి నామాకు భారీ మెజార్టీతో గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు.