భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు బాధ్యత అధికారులదేనని, వాటిని అర్హులైన గిరిజనులకు అందేలా చూడాలని దిశ కమిటీ చైర్మన్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ అన్నారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశాన్ని శనివారం నిర్వహించారు. శాఖల వారీగా పూర్తి చేసిన, నిర్మాణ దశలో ఉన్న, ఇతర అభివృద్ధి పనులపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దారిద్య్ర రేఖకు దిగువనున్న ప్రతి పేద, ఆదివాసీ గిరిజన గ్రామాల్లోని గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందించాలన్నారు. పేదరిక నిర్మూలన, నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, బాలల హక్కులు, బాల కార్మిక వ్యవస్థలపై అధికారులు దృష్టి సారించాలన్నారు. నియోజకవర్గాల్లోని మారుమూల ప్రాంతాల్లో విద్యుత్, తాగునీరు, రోడ్ల సమస్యలు లేకుండా చూడాలన్నారు.
ఉన్నత, గిరిజన సంక్షేమ పాఠశాలలు, అంగన్వాడీ కే్రందాలు, పీహెచ్‌సీలు, మాతా, శిశు సంరక్షణ కేంద్రాల్లో అన్ని రకాల వసతులు, సౌకర్యాలు కల్పించాలని, వీటిని కలెక్టర్, ఐటీడీఏ పీవోలు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని చెప్పారు. అనంతరం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడారు. సమావేశంలో కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్, అదపు కలెక్టర్ వేణుగోపాల్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, మాలోత్ రాందాస్‌నాయక్, జారే ఆదినారాయణ, దిశ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.