ఖమ్మం, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో భారత పత్తి సంస్థ(సీసీఐ) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కొనుగోళ్లు మాత్రం తూతూమంత్రంగానే జరిగాయి. ప్రైవేట్ మార్కెట్లో రైతులకు మద్దతు ధర లభించడం లేదని ప్రభుత్వమే సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ రైతులు ప్రైవేటులోనే అధిక మొత్తంలో పంటను విక్రయిస్తున్న పరిస్థితులు కన్పిస్తున్నాయి. దీంతో ‘నామ్‌కే వాస్తే’గానే సీసీఐ కేంద్రాల్లో కొనుగోళ్లు జరిగినట్లు అర్థమవుతోంది.
ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఈ సంవత్సరం సుమారుగా 2.30 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. వరుసగా వర్షాలు, వరదలు రావడం; చీడపీడలు ఆశించడం వంటి కారణాలతో దిగుబడులు పెద్దగా రాలేదు. సాధారణంగా పత్తిలో ఎకరానికి 10-12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంటుంది. కానీ.. ఈ ఏడాది 5-6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని రైతులు చెబుతున్నారు. మొదటి దఫా పత్తితీత తరువాత తిరిగి మొగ్గలు రాకపోవడంతో పత్తి పంట స్థానంలో ఆయా మండలాల రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు.
ప్రైవేటులోనే అధిక విక్రయాలు..
ఇక ఈ ఏడాది జిల్లాలోని ఆయా వ్యవసాయ మార్కెట్లలో ప్రైవేట్ పత్తి ఖరీదుదారులు 3,81,730 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. భారత పత్తి సంస్థ ఏర్పాటు చేసిన తొమ్మిది సీసీఐ కేంద్రాల్లో కలిపి ఇప్పటివరకు 2,64,251 క్వింటాళ్లు మాత్రమే కొనుగోళ్లు చేశారు. అంటే ప్రైవేట్ వ్యాపారులు సీసీఐ కంటే దాదాపుగా 1.20 లక్షల క్వింటాళ్ల పత్తిని అదనంగా కొన్నారు. సీసీఐ మద్దతు ధరకంటే క్వింటాకు రూ.500రూ.1,000 వరకు తక్కువ ధర పలికినప్పటికీ రైతులు ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముకునేందుకు మొగ్గు చూపారు. భారత పత్తి సంస్థ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ సీజన్ ఆరంభంలో ఆశించిన మేర కొనుగోళ్లు జరపలేదు. దీంతో బీఆర్ఎస్ రాష్ట్ర నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఖమ్మం ఏఎంసీలో పర్యటించారు. పత్తి రైతుల పాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, హరీశ్‌రావు పర్యటన నేపథ్యంలో కొనుగోళ్ల ప్రక్రియను సీసీఐ వేగవంతం చేసింది. ఇక దళారులు కూడా గ్రామాల్లో రైతుల వద్ద కొనుగోలు చేసిన పంటను నేరుగా సీసీఐ కేంద్రాలకు తరలించి రైతుల పంటగా చూపి సొమ్ము చేసుకున్నారు.
ఏఎంసీల్లో కొనుగోళ్లు ఇలా..
జిల్లా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఖమ్మం, మధిర, కల్లూరు, వైరా, ఏన్కూరు, సత్తుపల్లి, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ల పరిధిలో ప్రైవేట్ వ్యాపారులు పంట కొనుగోలు చేశారు. నేటి వరకూ ఏఎంసీలవారీగా పరిశీలిస్తే.. ఖమ్మంలో 1,70,390 క్వింటాళ్లు, మధిరలో 20,322 క్వింటాళ్లు, కల్లూరులో 932 క్వింటాళ్లు, వైరాలో 18,047 క్వింటాళ్లు, ఏన్కూరులో 1,70,669 క్వింటాళ్లు, సత్తుపల్లిలో 100 క్వింటాళ్లు, మద్దులపల్లిలో 1,270 క్వింటాళ్ల పత్తిని ప్రైవేట్ వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. దీంతో మొత్తంగా ఈ ఏడాది ప్రైవేట్ వ్యాపారులు 3,81,730 క్వింటాళ్ల పంటను కొనుగోలు చేసినట్లయింది. అయితే, ప్రైవేట్‌లో ఈ సంవత్సరం అత్యధికంగా క్వింటాకు రూ.7,200 ధర పలుకగా.. అత్యల్పంగా క్వింటాకు రూ.6,300 ధర పలికింది.
సీసీఐ కొనుగోళ్లు ఇలా..
పత్తి పంటను కొనుగోలు చేసేందుకు సీసీఐ అధికారులు ఖమ్మం జిల్లావ్యాప్తంగా తొమ్మిది జిన్నింగ్ మిల్లుల వద్ద సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం, మద్దులపల్లి ఏఎంసీలో రెండు చొప్పున, మధిర ఏఎంసీ పరిధిలో మూడు చొప్పున, నేలకొండపల్లి, వైరాల్లో ఒక్కోటి చొప్పున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలవారీగా పరిశీలిస్తే జీఆర్ఆర్ గుర్రాలపాడు కేంద్రంలో 25,197 క్వింటాళ్లు, శ్రీబాలాజీ జిన్నింగ్ మిల్లు కేంద్రంలో 19,201 క్వింటాళ్లు, అమరావతి జిన్నింగ్ మిల్లు కేంద్రంలో 28,888 క్వింటాళ్లు, మంజిత్ జిన్నింగ్ మిల్లు కేంద్రంలో 26,239 క్వింటాళ్లు, శ్రీశివ గణేశ్ జిన్నింగ్ మిల్లు కేంద్రంలో 37,268 క్వింటాళ్లు, ఉషా జిన్నింగ్ మిల్లు కేంద్రంలో 43,403 క్వింటాళ్లు, ఎంఎస్ స్టఫ్లిచ్ కేంద్రంలో 25,123 క్వింటాళ్లు, పొన్నెకల్ జీఆర్ఆర్ కేంద్రంలో 54,453 క్వింటాళ్లు, భాగ్యలక్ష్మి కేంద్రంలో 33,010 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు సీసీఐ ద్వారా 2,64,425 క్వింటాళ్ల కొనుగోళ్లు మాత్రమే జరిగాయి.
ప్రైవేట్‌లో పత్తి కొనుగోళ్లు : 3,81,730 క్వింటాళ్లు
సీసీఐ పత్తి కొనుగోళ్లు : 2,64,251 క్వింటాళ్లు
సీసీఐ మద్దతు ధర (క్వింటాకు) : రూ.7,520
ప్రైవేట్‌లో అత్యధిక ధర (ఏఎంసీలో) : రూ.7,200