కూసుమంచి (నేలకొండపల్లి), నవంబర్ 20: బీఆర్ఎస్తోనే పాలేరు నియోజకవర్గ ప్రగతి సాధ్యమని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇదే ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ సహకారంలో ఇప్పటికే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దానని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, తాను అందించిన సహకారాన్ని ప్రజలు గమనించి మరోసారి తనకు అవకాశం కల్పించాలని కోరారు. ఈసారి అత్యధిక మెజార్టీ అందిస్తే నియోజకవర్గాన్ని మరింతగా తీర్చిదిద్దుతానని మాట ఇచ్చారు. నేలకొండపల్లి మండలంలో సోమవారం పర్యటించిన ఆయన కొంగర, కట్టుకాసారం, అప్పల నర్సిహాపురం తదితర గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు ఉన్న దుర్భత స్థితిని, తెలంగాణ వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు.
ఉమ్మడి పాలకుల ఏలుబడిలో ఈ ప్రాంతమంతా అభివృద్ధిలో అధమంగా ఉండేదని గుర్తుచేశారు. స్వరాష్ర్టాన్ని సాధించిన ఉద్యమనేత కేసీఆర్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలంగాణను అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారని గుర్తుచేశారు. అందువల్లనే తెలంగాణ రాష్ట్రం నేడు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని వివరించారు. ఇంతటి అభివృద్ధికి కారణమైన కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. అందుకోసం కారు గుర్తుకు ఓటు వేసి తనకు అత్యధిక మెజార్టీ అందించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త తాళ్లూరి జీవన్‌కుమార్, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు నంబూరి శాంత, ఉన్నం బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా అప్పలనర్సిహాపురం గ్రామంలో ఎమ్మెల్యే కందాళ ట్రాక్టర్ నడిపి ఆకట్టుకున్నారు.