జాలువారుతున్న జలధారలు. షవర్‌ను తలపించే మాదిరిగా నీటి తుంపరలు. చూసేకొద్దీ చూడాలనిపించే జలసవ్వడులు, తనివితీరని దృశ్యాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం హనుమాన్ ఆలయ సమీపంలోని రథంగుట్టపై నుంచి వెన్నెల జలపాతం కనువిందు చేస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొత్త నీటితో జలపాతం సవ్వడి చేస్తోంది. సోమవారం స్థానికులు, పర్యాటకులు ఈ జలపాతాన్ని సందర్శించడంతోపాటు నీటిలో సందడి చేస్తూ కేరింతలు కొట్టారు. వెన్నెల జలపాతం వద్ద అటవీ శాఖ అధికారులు పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ఈ ప్రాంతం జాతరను తలపిస్తోంది.