కారేపల్లి, మార్చి 12 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో గల శివారు గ్రామాలలో ప్రకృతి అందాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. కారేపల్లి మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారులకు ఇరువైపులా ఉన్న మోదుగు చెట్లు విరగబూసి(Moduga poolu )చూపరులను ఆకర్షిస్తున్నాయి. అరుణ వర్ణంలో ధగ ధగా మెరిసిపోతూ వాహనదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. హోలీ పండుగకు ఈ పూలను విరివిగా వాడుతుంటారు. ఈ మోదుగుపూలను గోగు పూలు, అగ్గిపూలు, ఎర్రని పూలగా గ్రామాలలో పిలుస్తుంటారు. శివరాత్రికి ముందు పూచేటటువంటి ఈ మోదుగు పూలు శివునికి అత్యంత ప్రీతికరమని పురాణాలు చెబుతున్నాయి.
అంతేకాదు గ్రామీణ ప్రాంతాలలో హోలీ పండుగకు పిల్లలు మోదుగు పువ్వులు సేకరించి ఉడకబెట్టి రంగు తయారు చేస్తారు. ఒకరిపై ఒకరు చల్లుకుంటూ సరదాగా రంగుల పండుగ సంబరాలను జరుపుకుంటారు.
అదేవిధంగా మోదుగు చెట్టుకు మానవ మనుగడకు విడదీయలేని బంధం ఉంది. పండుగలకు, దేవుళ్లను పూజించడానికి అనేక విధాలుగా మోదుగు చెట్టు ఉపయోగపడుతుంది. మోదుగు ఆకులతో విస్తరాకులు తయారు చేస్తారు. చెట్టు వేర్లు దాని నారను తొలిచి తాళ్లు వివిధ వస్తువులను తయారు చేస్తారు. మోదుగు పసరును ఆయుర్వేద మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు.
అంతేకాకుండా ఈ మోదుగు కలపను హోమం కాల్చేటప్పుడు వాడుతారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా మోదుగు చెట్లు మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి. బహుళ ప్రయోజనాలున్న మోదుగు చెట్టుతో పల్లె వాసులకు విడదీయలేని బంధం ఉంది. ఎలాంటి హాని చేయని మోదుగు పూలతో చేసిన సహజ సిద్ధరంగులతోనే ఈసారి ప్రతి ఒక్కరు హోలీని జరుపుకుంటారని ఆశిద్దాం.