రఘునాథపాలెం/ ముదిగొండ, జూన్ 5 : ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం మోస్తరు వర్షం పడింది. ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, కొణిజర్ల, వైరా, చింతకాని, నేలకొండపల్లి, ముదిగొండ, తల్లాడ తదితర మండలాలతోపాటు ఖమ్మం నగరంలో మధ్యాహ్నం అరగంటపాటు వర్షం కురిసింది.

ఉదయం 46డిగ్రీలు చూపించిన ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గిపోయింది. భానుడి భగభగలతో ఉడికిపోతున్న ప్రజలకు ఈ వాన ఉపశమనాన్ని కలిగించింది. ఖమ్మం నగరంలో విద్యార్థులు, వాహనదారులు, వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం అనంతరం వీచిన చల్లనిగాలులతో జిల్లాలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ఎండవేడిమి నుంచి ఉపశమనం లభించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
