ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 6: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఆదివారం ఖమ్మంజిల్లాలో కనపడింది. ఉదయం నుంచి మేఘాలు అలుముకోవడంతో వాతావరణం చల్లబడింది. బతుకమ్మ పండుగ ఐదోరోజు, దేవీనవరాత్రుల నాలుగో రోజును పురస్కరించుకొని సాయంత్రం వేళ అమ్మవారి మండపాల వద్దకు మహిళలు బతుకమ్మలు తీసుకొచ్చే సమయానికి ఖమ్మం నగరంలో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది.
దాదాపు 30 నిమిషాలపాటు నగరంలో చెదురుమదురు జల్లులతో కూడిన వర్షం కురవడంతో ద్విచక్ర వాహనదారులు స్వల్ప ఇబ్బందులకు గురయ్యారు. అల్పపీడనం ప్రభావం ఆంధ్రా, తెలంగాణలో స్పష్టంగా ఉంటుందని, రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. మళ్లీ వర్షాలు కురిస్తే పత్తి, వరి పంట పొలాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వర్షాలు, వరదలకు పోను మిగిలిన కొద్దిపాటి పంటలను కాపాడుకునేందుకు రైతులు గత కొద్దిరోజుల నుంచి మిర్చి, పత్తి పంటల్లో సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. మరోమారు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటనలు విడుదలకావడంతో సాగుదారులు ఆందోళన చెందుతున్నారు.