భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షం భద్రాద్రి జిల్లాను వదలడం లేదు. ముసురుతోపాటు కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు పడుతుండడంతో చెరువులు, వాగులు, చెక్‌డ్యాంలు పొంగి ప్రవహిస్తున్నాయి.
దీనికితోడు ఎగువనున్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి వస్తున్న వరదతో తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరగా.. భద్రాచలం వద్ద గోదావరి క్రమేపీ పెరుగుతున్నది. వరదలతో భద్రాచలం పరిధిలో ఏపీ రాష్ర్టానికి రాకపోకలు నిలిచిపోయాయి. అశ్వారావుపేట మండలంలో కురిసిన భారీ వర్షానికి ఇల్లు కూలిపోయింది.
టేకులపల్లి మండలంలోని రోళ్లపాడు, చంద్రయ్యకుంట, పరిక వాగు, లచ్చగూడెం వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులన్నీ మత్తడి పోస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలతోపాటు పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. కిన్నెరసాని, ముర్రేడు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇల్లెందులో వాగులు పొంగుతున్నాయి.
సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం చెరువు అలుగు పారుతుండగా.. కట్ట బీటలు వారింది. లక్ష్మీదేవిపల్లి మండలంలో చెరువులన్నీ మత్తడి పోస్తున్నాయి. చుంచుపల్లిలో ఎర్రచెరువు మత్తడి పోస్తుంది. మణుగూరు, అశ్వారావుపేట మండలాల్లో చెరువులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పడంతో చెరువులకు గండ్లు పడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కిన్నెరసాని ప్రాజెక్టులోకి వరద నీరు చేరింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి 13 వేల క్యూసెక్కుల నీటి దిగువకు విడుదల చేశారు. తాలిపేరు రిజర్వాయర్ 24 గేట్లు ఎత్తి లక్షా 40 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో భద్రాచలం వద్ద క్రమేపీ వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతానికి భద్రాచలం వద్ద 28.2 అడుగుల మేర నీటిమట్టం చేరింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.
నాలుగు రోజులపాటు భద్రాద్రి జిల్లాకు హై అలర్ట్ ప్రకటించగా.. వర్షాలు కూడా అదే స్థాయిలో కురుస్తున్నాయి. అశ్వారావుపేటలో 19 మిల్లీమీటర్లు, దుమ్ముగూడెం 14, కరకగూడెం 15, ములకలపల్లి 14, అశ్వాపురం 13, ఆళ్లపల్లి 9.5, గుండాల మండలంలో 8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రాత్రికి కూడా వర్షం కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.