చింతకాని, ఏప్రిల్ 3: బీఆర్ఎస్కు ప్రజాబలం ఉందని, గులాబీ జెండానే ప్రజలకు అండ అని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల ఖమ్మం జిల్లా సమన్వయకర్త, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కొదుమూరు గ్రామంలోని జ్యోతి ఫంక్షన్ హల్లో సోమవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అధ్యక్షతన 13 పంచాయతీలకు చెందిన కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తున్నదన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారన్నారు. పార్టీ విజయం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. గ్రామస్థాయిలో ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తీసుకెళ్లాలన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో వైఫల్యాలను వివరించాలన్నారు. అక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను బేరీజు వేసి వివరించాలన్నారు. కరపత్రాలు పంచి గోబెల్స్ ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గోదావరి జలాలను సముద్రం పాలు చేసిందన్నారు. ప్రజల తాగునీరు, సాగునీటి కష్టాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ గోదావరి నీళ్లను పంటలకు మళ్లించేందుకు సీతారామ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారన్నారు. ప్రాజెక్ట్ పూర్తయితే ఉమ్మడి జిల్లా సస్యశ్యామలమవుతుందన్నారు.
మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ రంగ సంస్ధలను ప్రవేటు పరం చేస్తున్నదన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలన్నారు. బీఆర్ఎస్ నాయకుడు బొమ్మెర రామ్మూర్తి మాట్లాడుతూ.. కార్యకర్తలు ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలన్నారు. సీఎం కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, జడ్పీటీసీ పర్చగాని తిరుపతికిశోర్, వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు, నాయకులు మంకెన రమేశ్, కన్నెబోయిన కుటుంబరావు, కురుగుంట్ల రవీందర్‌రెడ్డి, వంకాయలపాటి వెంకటలచ్చయ్య, బొగ్గారపు రాంబాబు, బొడ్డు వెంకట్రామయ్య, గడ్డం శ్రీను, నూతలపాటి వెంకటేశ్వర్లు, వేముల నర్సయ్య, బండి సుభద్ర, దొబ్బల నాగేశ్వరరావు, కోరిపల్లి శ్రీను, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
పొంగులేటీ.. కేసీఆర్‌పై నిరాధారమైన ఆరోపణలు వద్దు..
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన స్థాయికి మించి సీఎం కేసీఆర్‌పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం వరకు కేసీఆర్‌ను దేవుడు అని కీర్తించి ఇప్పుడు ద్వేషించడంలో మతలబు ఏమిటి.. పొంగులేటీ? బీఆర్ఎస్ మీకు చేసిన అన్యాయం ఏమిటో చెప్పండి. కేసీఆర్ పొంగులేటికి తగిన ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోలేదు. సీతారామ ప్రాజెక్ట్‌పై విమర్శలు చేస్తున్న పొంగులేటి ఇదే ప్రాజెక్టు పనులకు ఎందుకు టెండర్లు వేశారో చెప్పాలి. ఇకనైనా ఆయన అవకాశవాద రాజకీయాలు మానుకోవాలి. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిపక్ష నాయకుల ఆరోపణలను తిప్పికొట్టాలి. ప్రజలకు తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించాలి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలి.
– బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు
మధిరలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం..
వచ్చే ఎన్నికల్లో మధిరలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విరివిగా నిధులు కేటాయించింది. దళితబంధు పథకంలో భాగంగా ఒక్క చింతకాని మండలంలోనే రూ.350 కోట్ల విలువైన యూనిట్లు అందజేసింది. ఒకప్పుడు నిధుల్లేక అభివృద్ధిలో వెనుకబడిన పల్లెలు ఇప్పుడు అభివృద్ధి బాట పట్టాయి. ఇప్పటివరకు నియోజకవర్గవ్యాప్తంగా 2 వేల మందికి సీఎంఆర్ఎఫ్, 5 వేల మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందాయి. అర్హత ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు, రైతుబీమా పథకాలు వర్తిస్తున్నాయి. ఇటీవల బోనకల్లు మండలంలో పంట నష్టం జరిగితే సాక్షాత్తు సీఎం కేసీఆరే క్షేత్రస్థాయికి వచ్చారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. కానీ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాత్రం పాదయాత్రకు వెళ్లి రాజకీయాలు చేస్తున్నారు. ప్రతిపక్షాల మాటలను ప్రజలు విశ్వసించడం లేదు. కార్యకర్తలంతా కలిసి కట్టుగా పనిచేసి సీఎం కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలి.
– జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజు