ఖమ్మం, అక్టోబర్ 28:బీఆర్ఎస్ను, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేని సీఎం రేవంత్‌రెడ్డి.. చౌకబారు పనులకు తెరతీస్తున్నారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆరోపించారు. అందులో భాగంగానే కేటీఆర్ బావమరిది ఇంట్లో జరిగిన కుటుంబ వేడుకను రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ 11 నెలల పాలనలో ఏర్పడిన ప్రజా వ్యతిరేకతను పక్కదోవ పట్టించేందుకే ఇలాంటి చర్యలకు పూనుకున్నారని అన్నారు. కేటీఆర్ బావమరిది కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో గృహ ప్రవేశం సందర్భంగా కుటుంబ వేడుకను ఏర్పాటు చేసుకుంటే దానిని రేవ్ పార్టీ అనడం సరికాదని, ఆ నెపంతో పోలీసులు సోదాలు చేయడం అత్యంత దారుణమని అన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు తెలియని వ్యక్తులు తెలంగాణకు పాలకులుగా ఉండడం దురదృష్టకరమని అన్నారు. పండుగలు, శుభకార్యాలు జరిగినప్పుడు హాజరయ్యే బంధువులకు చుట్టరికం చేయడం సహజమేనని, అంత మాత్రాన అది తప్పని చెప్పడం అన్యాయమని అన్నారు. కేటీఆర్ బావమరిది ఇంట్లో జరిగిన వేడుకలో వారి కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే పాల్గొన్నారని తెలిపారు.
రాజ్ పాకాల స్నేహితుడైన అమెరికా పౌరుడు విజయ్ కూడా ఆ వేడుకలో పాల్గొన్నారని, అంతమాత్రాన వారి ఇంట్లో డ్రగ్స్ పట్టుబడ్డాయని కాంగ్రెస్, బీజేపీ నాయకుల అనుకూల మీడియాలు తప్పుడు కథనాలు వండి వార్చాయని విమర్శించారు. కానీ ఆ ఇంట్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఏమీ దొరకలేదని, కేవలం ఫారిన్ డ్రింక్ కొంత మేర లభించిందని ఎక్సైజ్ శాఖ అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేశారని వివరించారు. ఆ స్టేట్మెంట్ను కూడా విలేకరుల ఎదుట తాతా మధు ప్రదర్శించారు. ‘కాంగ్రెస్ మంత్రులు, నాయకుల ఇళ్లలో విదేశీ మద్యం లేదా?’ అని ప్రశ్నించారు. ‘వారు విదేశీ మద్యం తాగుతారో లేదో చెప్పాలి?’ అని డిమాండ్ చేశారు. విదేశాల నుంచి వచ్చే వారెవరైనా ఒక్కొక్కరూ రెండు బాటిళ్లు వెంట తెచ్చుకోవచ్చనే నిబంధన ఉందని గుర్తుశారు. అయినప్పటికీ ఈ చిన్న విషయానికి దురుద్దేశాన్ని ఆపాదించి డ్రగ్స్ అని చెప్పడం శోచనీయమని అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి ధైర్యముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని హితవుచెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలను కేటీఆర్, హరీశ్‌రావు సహా మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు వెలుగులోకి తెస్తున్నారని అన్నారు.
సివిల్ సప్లయి స్కాం, అమృత్ స్కీం స్కాం, మూసీ ప్రక్షాళన, హైడ్రా వంటివాటిపై గొంతెత్తుతున్న కేటీఆర్‌ను ఎదుర్కోలేకనే రేవంత్‌రెడ్డి ఇలా చిల్లర చేష్టలకు దిగుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌కు వత్తాసుగా బండి సంజయ్, మెదక్ ఎంపీలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ నాయకులు కూరాకుల నాగభూషణం, ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, ఉప్పల వెంకటరమణ, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బిచ్చాల తిరుమలరావు, బెల్లం వేణు, పగడాల నరేందర్, జర్పుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.