ఖమ్మం, అక్టోబర్ 25: బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు.. కేసులు, జైళ్లు కొత్తేమీకాదని, వీటికి పార్టీ శ్రేణులేమీ భయపడబోవని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టం చేశారు. తప్పుడు కేసులు పెడితే భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించక తప్పదని తేల్చిచెప్పారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం ఉంది కదా అని కాంగ్రెస్ నాయకులు వారి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే భవిష్యత్‌లో వడ్డీతో సహా చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుండడంతో క్రియాశీలకంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అన్నారు.
బీఆర్ఎస్ చింతకాని మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను అయ్యప్పస్వామి మాలలో ఉండగా అత్యవసరంగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో మధిర నియోజకవర్గ ప్రజలకు తెలుసునని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, పోలీస్ ఉన్నతాధికారులు హుందాతనంతో పనిచేయాలని, ఎవరి మెప్పు కోసమో పనిచేస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని అన్నారు. ‘ప్రజల పక్షాన పోరాడే స్వేచ్ఛ ప్రతిపక్షానికి లేదా?’ అని ప్రశ్నించారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు తన భూమిని కబ్జా చేసినందునే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ రైతు కుటుంబానికి నేటికీ న్యాయం జరగలేదని అన్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో రైతును పొట్టనపెట్టుకున్న ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలతో అన్నివర్గాల ప్రజలు సతమతమవుతున్నారని, అధికారం చేపట్టిన అతి తకువ సమయంలోనే ప్రజలు కాంగ్రెస్‌ను చీదరించుకుంటున్నారని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయించి రాక్షసానందం పొందుతున్న కాంగ్రెస్ పార్టీ నేతల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పాలేరు, ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అన్నారు.
నాడు తెలంగాణ పోలీసులకు ఫ్రెండ్లీ పోలీస్‌గా ప్రత్యేక గుర్తింపు వచ్చేవిధంగా కేసీఆర్ పాలన అందించారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పోలీసులను తప్పుడు కేసులకు ప్రోత్సహిస్తూ కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారని అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే.. ప్రస్తుతం ఏపీలో ఉన్నతాధికారులకు పట్టిన గతి పడుతుందని స్పష్టం చేశారు పుల్లయ్యతో జైలులో ములాఖత్ ఖమ్మం జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ చింతకాని మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను తాతా మధు, సండ్ర వెంకటవీరయ్య, లింగాల కమల్‌రాజు పరామర్శించారు. పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
ఖమ్మం, అక్టోబర్ 25: కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేది లేదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. బీఆర్ఎస్ చింతకాని మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యపై అక్రమంగా కేసు పెట్టడం, అరెస్టు చేయడం ద్వారా అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. పుల్లయ్య అరెస్టును తట్టుకోలేక ఆయన భార్య గుండెనొప్పితో కుప్పకూలినా.. అధికార పార్టీ నేతలు మానవతా విలువలను మరిచారని విమర్శించారు. ప్రజల మద్దతుతో ఇలాంటి చర్యలకు గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు.
ఖమ్మం, అక్టోబర్ 25: బీఆర్ఎస్ చింతకాని మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులను తప్పుడు కేసులతో వేధించడం సరికాదని అన్నారు. రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదని, ప్రజల హకుల కోసం పోరాడే వారిని అరెస్ట్ చేయడం తగదని అన్నారు. పుల్లయ్యపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు