ఖమ్మం ఫిబ్రవరి 23: సమష్టిగా పనిచేసి బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేద్దామని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో గురువారం కొణిజర్ల మండల ముఖ్యనాయకులతో ఎమ్మెల్యే రాములునాయక్తో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బూత్ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు కార్యకర్తలు నిబద్ధతతో పనిచేయాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్లో ఎలాంటి గ్రూపులు లేవన్నారు.
ఉన్నది ఒకటే గ్రూప్ అది బీఆర్ఎస్ గ్రూప్ అని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులు రానున్న ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. పార్టీలో చిన్న చిన్న సమస్యలు వస్తే వాటిని అన్నదమ్ముల్లా పరిష్కరించుకోవాలన్నారు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎవరూ పార్టీకి అతీతులు కారని, అందరూ పార్టీ అధిష్ఠాన డైరెక్షన్లోనే నడవాలన్నారు. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదన్నారు. ఎవరైనా పార్టీని నష్టపరచాలని చూస్తే పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. పార్టీ మనకు ఇచ్చిన పదవులతో పార్టీని మరింత బలోపేతం చేద్దామన్నారు. ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ కలిసి కట్టుగా పనిచేసి రానున్న ఎన్నికల్లో సత్తా చాటుదామన్నారు. జిల్లా ఎంతో చైతన్యవంతమైన జిల్లా అని, ఆ చైతన్యాన్ని మనం ప్రదర్శించాలన్నారు. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, కొణిజర్ల మండల అధ్యక్షుడు చిరంజీవి, జడ్పీటీసీ కవిత తదితరులు పాల్గొన్నారు.