ఖమ్మం, నవంబర్ 9 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్‌పై అనుచిత, అభ్యంతర, అవమానకర వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై వెంటనే కేసు నమోదు చేయాలని ఖమ్మం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ డిమాండ్ చేశారు. శనివారం బీఆర్ఎస్ నగర, జిల్లా నాయకులతో కలిసి ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ వద్ద తాతా మధు మాట్లాడుతూ మూసీ నది వెంట పాదయాత్ర సందర్భంగా సీఎం రేవంత్ కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగడం ఆక్షేపణీయమన్నారు.
పదేండ్లు సీఎంగా పనిచేసిన ఒక వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేశారని అన్నారు. కేసీఆర్ ప్రతిష్టను భంగపరిచేలా ఉన్నందున రేవంత్‌రెడ్డిపై చట్టప్రకారం కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన పోరాటం, ఆయన నాయకత్వం ప్రజలకు స్ఫూర్తిదాయకమని, అలాంటి వ్యక్తిని అవమానపరిచే విధంగా మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు. అనుచిత వ్యాఖ్యలను రేవంత్ వెం టనే వెనకి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాం డ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాక వారిని ఏమారుస్తున్నారని అన్నారు.
అధికారం ఉంది కదా అని విర్రవీగుతున్న రేవంత్‌రెడ్డి తన తీరును మార్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీజేపీకి రేవంత్‌రెడ్డికి ఉన్న సంబంధం ఏమిటో రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తెలిపిన శుభాకాంక్షలతోనే తేలిపోయిందని, రేవంత్‌రెడ్డికి కనీసం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెద్దలు ఏ ఒకరు శుభాకాంక్షలు తెలపకపోవడం ఆ పార్టీలో రేవంత్‌రెడ్డికి ఉన్న గౌరవాన్ని తెలుపుతుందన్నారు. తాతా మధుతోపాటు బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మంరూరల్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య, మాజీ ఎంపీపీ సామినేని హరిప్రసాద్, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మాదంశెట్టి వీరభద్రం, నున్నా శ్రీనివాసరావు, బంక మల్లయ్య, ముత్యాల వెంకటప్పారావు, పగడాల నరేందర్, డేరంగుల బ్రహ్మం, కోటి అనంతరాములు, సిద్దాం షేక్, బొడ్డు గ్లోరీ, మద్దెల విజయ్, సతీష్, రాజేష్ పాల్గొన్నారు.