ఖమ్మం, డిసెంబర్ 5 : బీఆర్ఎస్ సీనియర్ నేతలను అరెస్ట్ చేసిన రేవంత్ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెబుతామని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్సీలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ప్రశ్నించే గొంతులను అరెస్టుల ద్వారా అణచివేయాలని చూడడం అప్రజాస్వామికమని, మా పార్టీ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న రేవంత్‌రెడ్డి నాయత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం మొదలైందన్నారు. బీఆర్ఎస్తో పెట్టుకుంటే రానున్న రోజుల్లో తగిన మూల్యంగా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. అక్రమ అరెస్టులను మేధావులు, ప్రజాస్వామిక శక్తులు, తెలంగాణవాదులు ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.