ఖమ్మం రూరల్ : ప్రభుత్వ ఉద్యోగిగా, సామాజిక కార్యకర్తగా, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడిగా బహుముఖ సేవలు అందించిన కత్తి నెహ్రు గౌడ్ సేవలు శ్లాఘణీయమని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు, రాష్ట్ర హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని జీ ఎంఆర్ ఫంక్షన్ హాల్లో గోపా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బల్లికొండ శ్రీనివాస్ అధ్యక్షతన కత్తి నెహ్రు గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాల తరబడి అటు సమాజ అభివృద్ధి, ఇటు విద్యాభివృద్ధికి జోడెద్దుల్లా విశేష కృషి చేసిన నెహ్రూ అభినందనీయుడన్నారు.
బీసీ సంఘాల ఐక్యత, అక్షరాస్యత పెంపునకు ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. నిత్యం తన మోముపై చిరునవ్వును ప్రదర్శిస్తూ అందరివాడిగా పేరు తెచ్చుకున్న నెహ్రు భవిష్యత్తులో సైతం సమాజ అభివృద్ధికి రెట్టింపు కృషి చేయాలన్నారు. అభినవ చాచాగా పేరొందిన నెహ్రు గౌడ్ నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ జె సి కృష్ణ గౌడ్, సంఘం రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు అమరగాని వెంకటేశ్వర్లు, బొర్రా రాజశేఖర్ గౌడ్, వడ్డెబోయిన నర్సిహారావు, మార్కం లింగయ్య గౌడ్, పోతగాని కృష్ణారావు, కొత్త సీతారాములు, డాక్టర్ రాజశేఖర్, బోడపట్ల వెంకటేశ్వర్లు, పగడాల నాగరాజ్, బత్తుల పాటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, బీసి సంఘాల ప్రతినిధులు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.