దుమ్ముగూడెం, డిసెంబర్ 1: వసతిగృహాల్లో నాణ్యమైన భోజనం అందించడం లేదంటూ స్వయంగా విద్యార్థులే చెబుతున్నారని ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ రాష్ట్ర నేత రాకేశ్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు. వసతులు, సౌకర్యాలు కూడా మెరుగ్గా లేవని వారు బాధపడుతున్నారని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో నాణ్యమైన భోజనం, విద్య అందాయని గుర్తుచేశారు.
వసతిగృహాల సందర్శనలో భాగంగా ఆదివారం సాయంత్రం దుమ్ముగూడెం మండలానికి చేరుకున్న వారు.. తొలుత లక్ష్మీనగరంలో వసతిగృహాలను పరిశీలించారు. వంటశాల, తరగతి గదులు, వసతిగృహాల పరిసరాలను గమనించారు. వసతిగృహాల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏకలవ్య పాఠశాలను పరిశీలించారు.
లేబొరేటరీలు లేవంటూ అక్కడి ఉపాధ్యాయులు బీఆర్ఎస్ నేతల దృష్టికి తీసుకొచ్చారు. తరువాత సీతారాంపురంలోని ఏకలవ్య పాఠశాలను కూడా పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పాఠశాల నిర్మాణ పనులు చూశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నాణ్యమైన భోజనం, మెరుగైన వసతులు కల్పించకుండా వారి జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. సర్కారు నిర్లక్ష్యంగా ఉంటున్నప్పటికీ విద్యార్థుల పట్ల వార్డెన్లు, హెచ్ఎంలు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా వారి ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. వసతిగృహాలపైనా, హాస్టళ్ల విద్యార్థులపైనా ప్రభుత్వం కూడా నిర్లక్ష్యాన్ని వీడాలని డిమాండ్ చేశారు.
ఏడాది కాంగ్రెస్ పాలనలో వసతిగృహాల పర్యవేక్షణ అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లతో తమకు నాణ్యమైన భోజనం అందడం లేదంటూ స్వయంగా విద్యార్థులు చెబుతుండడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. తాము పరిశీలించిన అన్ని హాస్టళ్లలో విద్యార్థులు ఇదే విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చారని వివరించారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో గురుకులాలు, వసతిగృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, సకల సదుపాయాలు అందేవని గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు మానే రామకృష్ణ, మండల కన్వీనర్ కణితి రాముడు, కో కన్వీనర్ జానీపాషా, కొత్తూరు సీతారామారావు, బొల్లి వెంకట్రావు, కలువ పూర్ణయ్య, దామెర్ల శ్రీనివాస్, లంకా శివ, కొత్తా మల్లేశ్వరరావు, భూపతిరావు, తంతరపల్లి వెంకటేశ్వరరావు, జుంజునూరి జయసింహ, గంగరాజు, చందు, నాగేశ్వరరావు, సూర్య, రాము, రాంబాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.