ఖమ్మం, మే 2: ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని శాసనమండలి సభ్యుడు, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు డిమాండ్ చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, బలగాలను ఉపసంహరించాలని కోరారు. మధ్య భారతదేశంలో ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై జరుగుతున్న నరమేధాన్ని వెంటనే నిలుపుదల చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డి మాండ్ చేస్తూ అఖిలపక్షాలు, ప్రజాసంఘాల, ప్రజాస్వామిక హక్కుల వేదికల ఆధ్వర్యంలో ఖమ్మంలో శుక్రవారం నిర్వహించిన మానవహారంలో తాతా మధు మాట్లాడారు.
శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, కా ల్పుల విరమణ పాటించాలని మావోయిస్టు పార్టీ నేతలు లేఖల ద్వారా తెలియజేసినప్పటికీ కనీస స్పందనలేకపోవడం మోదీ నిరంకుశపాలనకు నిదర్శనమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే విధంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ సహా వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాల నుంచి పగడాల నాగరాజు, పోట్ల నాగేశ్వరరావు, నున్నా నాగేశ్వరరావు, బాగం హేమంతరావు, గోకినపల్లి వెంకటేశ్వర్లు, రాజేంద్రప్రసాద్, గోపగాని శంకర్రావు, దేవిరెడ్డి విజయ్, డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్, డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, కాకి భాసర్, రవిమారుత్ తదితరులు పాల్గొన్నారు.