ఖమ్మం, ఏప్రిల్ 25: ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఖమ్మం జిల్లా ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ కోసమే పార్టీని స్థాపించి, రక్తపు చుక్క చిందించకుండా రాష్ర్టాన్ని సాధించి, పదేండ్లు బంగారు తెలంగాణను నిర్మించిన కేసీఆర్ సారధ్యంలో ఏర్పడిన బీఆర్ఎస్ ఈ 24 ఏండ్లలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, అవమానాలను చవిచూసిందన్నారు.
గాంధేయమార్గంలో ఉద్యమం చేసి రాష్ట్ర ఏర్పాటు కలను కేసీఆర్ సాకారం చేశారన్నారు. బీఆర్ఎస్ పథకాలు, ప్రజాసంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మి ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టారని, 16 నెలల పాలనలోనే కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ మాత్రమే పనిచేస్తుందని ప్రజలు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ముందుకుసాగాలంటే కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. బహిరంగ సభకు ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. జిల్లాలోని ఏ ప్రాంతానికి వెళ్లినా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ సభకు ఉమ్మడి జిల్లా నుంచి భారీఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరుకావాలని కోరారు.
ఈ సమావేశానికి ముందుగా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి కోసం మౌనం పాటించారు. బీఆర్ఎస్ నేతలు కొండబాల కోటేశ్వరరావు, బానోత్ చంద్రావతి, కూరాకుల నాగభూషణం, వరప్రసాద్, కర్నాటి కృష్ణ, మక్బూల్, ఉప్పల వెంకటరమణ, బెల్లం వేణుగోపాల్, బాషబోయిన వీరన్న, వేముల వీరయ్య, తాజుద్దీన్, బిచ్చాల తిరుమలరావు, సతీశ్, మంచానాయక్, బానోత్ రవి, జమీల్ షేక్, ఉపేందర్‌రెడ్డి, ముత్యాల వెంకటప్పారావు, సద్దాం షేక్ తదితరులు పాల్గొన్నారు.