ఖమ్మం సిటీ, మే 15: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ దిశానిర్దేశం మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ పటిష్టతే లక్ష్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించామని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సభ్యత్వ నమోదు ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్‌లో కేసీఆర్ సారధ్యంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, విధివిధానాలు, సభ్యత్వ నమోదు గురించి సుదీర్ఘంగా చర్చించామన్నారు.
అవే అంశాల గురించి తొలుత ఖమ్మం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యులతో మాట్లాడామన్నారు. బూత్ లెవల్, గ్రామ, మండల, అనుబంధ కమిటీలు, జిల్లా, రాష్ట్ర కమిటీలు, వాటి అనుబంధ కమిటీలు అన్నింటినీ నిర్మాణం చేసుకోనున్నామన్నారు వీటికంటే ముందుగా సభ్యత్వ నమోదు ప్రక్రియను డిజిటలైజేషన్ పద్ధతిలో పకడ్బందీగా నిర్వహించనున్నామని వెల్లడించారు. నిరంతరం పార్టీ కోసం తపనపడే కార్యకర్తలందరికీ కమిటీల్లో అధిక ప్రాధాన్యం కల్పిస్తామన్నారు.
ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞాణాన్ని పరిగణనలోకి తీసుకుని ఓటర్ల జాబితా, జనగణన వంటి అన్నీ డిజిటలైజేషన్ చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదును కూడా డిజిటలైజేషన్ పద్ధతిన నిర్వహించనున్నామని రవీందర్రావు అన్నారు. బూత్‌కు ఇద్దరు చొప్పున నియమించి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వారికి శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి మండలానికి ఐదుగురితో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని, నియోజకవర్గ బాధ్యులతో వారు కలిసి పనిచేస్తారన్నారు. ఖమ్మాన్ని నాలుగు విభాగాలుగా వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్, ఖానాపురం హవేలీతోపాటు రఘునాథపాలెం మండలం కలిపి మొత్తం ఐదు విభాగాలుగా విభజించామని తెలిపారు.
ఒక్కో దానికి ఐదుగురు చొప్పున 25 మంది సమన్వయ కమిటీలో సభ్యులుగా ఉంటారన్నారు. వీరంతా బూత్‌కు ఇద్దరు చొప్పున ఆన్లైన్ పరిజ్ఞానం, సోషల్ మీడియాలో నమోదు చేయగలిగిన యువకులను సెలెక్ట్ చేసుకుంటారని వివరించారు. అందరికీ కలిపి ఒకరోజు శిక్షణా శిబిరం ఉంటుందని, హైదరాబాద్ నుంచి నిఫుణులు వచ్చి ఇస్తారన్నారు. అనంతరం సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఉమ్మడి జిల్లాకు తాను సారథ్యం వహిస్తే, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రాష్ట్ర పార్టీ తరఫున బాధ్యుడిగా ఒకరు పర్యవేక్షిస్తారని వెల్లడించారు. నేడో, రేపో వారి నియామకం జరుగుతుందని, ఉమ్మడి జిల్లాలోని పదిమంది నియోజకవర్గ ఇన్చార్జిలు, మరో పది మంది రాష్ట్ర బాధ్యులు, తాను సమన్వయం చేసుకుని ముందుకు సాగుతామన్నారు.
ఖమ్మం జిల్లాకు సంబంధించి ఐదు నియోజకవర్గాలకు ఒక్కో దానికి ఒక్కోరోజు నగరంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో శిక్షణ ఉంటుందని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఇదే తీరున ప్రక్రియ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. తక్కెళ్లపల్లి రవీందర్రావును ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తదితర ఇతర నాయకులు ఘనంగా సన్మానించారు. సమావేశంలో ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, పార్టీ సీనియర్ నాయకులు గుండాల కృష్ణ, బానోత్ మంజుల, లకావత్ గిరిబాబు, పగడాల నాగరాజు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, శీలంశెట్టి వీరభద్రం, ఎస్కే మక్బూల్, బచ్చు విజయ్‌కుమార్, బెల్లం వేణుగోపాల్, ఎండీ తాజుద్దీన్, బత్తుల మురళి, గుండాల అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి ఖమ్మంజిల్లా పార్టీకి చెందిన నాయకులమంతా ఏకమై రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ను సీఎంగా చేసేంత వరకు కలిసికట్టుగా ముందుకు సాగుతామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. దీనిలో భాగంగా పార్టీ నిర్మాణ ప్రక్రియను పటిష్టంగా చేపడతామన్నారు. ఖమ్మంకు దాదాపు 700 మంది నిష్ణాతులైన కార్యకర్తలను ఏర్పాటు చేసుకుని సభ్యత్వ నమోదును పూర్తి చేస్తామన్నారు. క్వాలిఫైడ్ మెంబర్షిప్ అనేది ఇంపార్టెంట్‌గా బీఆర్ఎస్ పట్ల సానుభూతి, అనుబంధం, అమితమైన ప్రేమ ఉన్నవారిని పార్టీ సభ్యులుగా నియమిస్తామన్నారు. మరో పది పదిహేను సంవత్సరాలు ఎదురులేకుండా ఉండే విధంగా క్యాడర్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ఇది సరైన సమయమన్నారు.
-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
రైతులు, ఉద్యోగులు, అన్నివర్గాల ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని మిస్సయ్యామనే బాధ, భావనలో ఉన్నారని, తెలంగాణ రాష్ర్టానికి మరోదఫా ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మక్కలు, ధాన్యం కొనే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని, రైతులు చనిపోతున్నారని, కరెంట్ సరిగా అందడం లేదని, శాంతిభద్రతలు క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలిపించుకుంటామని అన్నారు.
– ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
ధాన్యం కొనుగోలు చేయలేక కాంగ్రెస్ సర్కారు ముప్పుతిప్పలు పడుతోందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కాంటాలు వేసి తరలించేందుకు లారీలు లేవని, అవసరమైన మిల్లులు, హమాలీలను ఏర్పాటు చేయకుంటే రైతుల సమస్యలు పరిష్కారమవుతాయా అని ప్రశ్నించారు. ఒక్కో మిల్లు దగ్గర క్వింటాకు 12కిలోల తరుగు తీస్తుంటే జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా సమస్యను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సరైన ప్రణాళికలు లేకపోవడం వల్లే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
– మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా సభ్యత్వ నమోదు తెలంగాణలో బీఆర్ఎస్ గెలుపునకు నాంది అని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యిందని, ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని విమర్శించారు. వచ్చే ఎన్నికలకు సిద్దం కావడానికి, బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి సభ్యత్వ నమోదు మొదటిమెట్టుగా పరిగణించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెల్చుకునే దిశగా అడుగులు ముందుకు వేయాలని పిలుపునిచ్చారు.
– మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి