ఖమ్మం, నవంబర్ 26 : తెలంగాణ చరిత్రపై చెరగని సంతకం కేసీఆర్‌దని వక్తలు పేర్కొన్నారు. మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఘనత స్వరాష్ట్ర సారథిదేనని స్పష్టం చేశారు. తెలంగాణ స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు, తెలంగాణ చరిత్రలో చెరిగిపోని రోజు నవంబర్ 29 అని గుర్తు చేశారు. అదే దీక్షా దివస్ అని స్పష్టం చేశారు. అందుకని ఆ రోజు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా సన్నాహక సమావేశంలో పార్టీ నేతలు ప్రసంగించారు. సన్నాహక సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, బీఆర్ఎస్ నేతలు, ఉద్యమకారులు కొండబాల కోటేశ్వరరావు, బానోతు చంద్రావతి, కూరాకుల నాగభూషణం, ఆర్జేసీ కృష్ణ, ఖమర్, పగడాల నాగరాజు, బెల్లం వేణు, లక్ష్మిరెడ్డి, బాణాల వెంకటేశ్వర్లు, మద్దెల రవి, భాషబోయిన వీరన్న, పెంట్యాల పుల్లయ్య, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, కనగాల వెంకటరావు, బొమ్మెర రామ్మూర్తి, డోకుపర్తి సుబ్బారావు, పగడాల నరేందర్, గుండ్లపల్లి శేషగిరిరావు, లింగనబోయిన సతీశ్, ఆసిఫ్ పాల్గొన్నారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్‌ను జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు పిలుపునిచ్చారు. ఆ రోజు కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో..’ అనే నినాదంతో తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ర్టాన్ని సాధించిన మహా నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు.
నాడు కేసీఆర్ తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దీక్షా దివస్ పేరుతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడంతోనే నాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చిందని జ్ఞప్తికి తెచ్చారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని చేపట్టి రాష్ర్టాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని వివరించారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని స్పష్టం చేశారు. తెలంగాణ జాతిపితగా నిలిచిన కేసీఆర్‌ను ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డి చులకన చేసి మాట్లాడడాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు.
ఖమ్మం జిల్లా ఉద్యమాల ఖిల్లా అని దీక్షా దివస్ ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు గుర్తు చేశారు. మలిదశ ఉద్యమాన్ని మలుపుతిప్పిన ఈ జిల్లా ఈ నెల 29 న జరిగే దీక్షా దివస్‌లో గులాబీమయం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రతి పోరాటంలోనూ తాను భాగస్వామిగా ఉన్నానని గుర్తు చేశారు.
కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజు అప్పటి పాలకులు ఆయనను అరెస్టు చేసి ఖమ్మం తీసుకొచ్చారని జ్ఞప్తికి తెచ్చారు. ఉద్యమం ప్రభావం తక్కువగా ఉంటుందని అప్పటి పాలకులు భావించి ఇక్కడికి తీసుకొచ్చినప్పటికీ ఖమ్మం ఉద్యమ బిడ్డలు, న్యాయవాదులు, విద్యార్థులు తమ పోరాటం, సంఘీభావం ద్వారా వారికి బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. చావు నోట్లో తల పెట్టి ఉద్యమించిన కేసీఆర్.. తాను చనిపోయినా తెలంగాణ ఇవ్వాలనే డిమాండ్‌తో దీక్ష చేపట్టారని వివరించారు. ఈ రోజున అధికారంలో ఉన్న నాయకుడూ ఏనాడు జై తెలంగాణ అనలేదని గుర్తుచేశారు.
దీక్షా దివస్ కార్యక్రమానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు కుటుంబ సభ్యులతో సహా పాల్గొనాలని కోరారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో శ్రేణులు కదలివస్తారని తెలిపారు. మన నాయకుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.