టేకులపల్లి, జూలై 18: కేంద్ర ప్రభుత్వం ‘సర్’కు గడువు పొడిగించిన నేపథ్యంలో అర్హుల ఓట్లు తొలగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీఎల్ఏలపై ఉన్నదని, వారు మరింత అప్రమత్తంగా ఉంటూ ఓటర్లకు అవగాహన కల్పించాలని ఉమ్మడి జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. మండలంలోని బోడు, టేకులపల్లి, బొమ్మనపల్లి గ్రామాల్లో చేపట్టిన సమగ్ర ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియా నాయక్‌తో కలిసి శనివారం పర్యవేక్షించారు.
అనంతరం నిర్వహించిన బీఎల్ఏల సమావేశంలో ఆయన మాట్లాడారు. బూత్‌స్థాయిలో ఉన్న బీఎల్ఏలు ఎన్యూమరేషన్ ఫారాలు నింపే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఓటర్లకు అవగాహన కల్పించడంతోపాటు వారికి సహకరించాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అలాగే పార్టీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని, అలాంటి వారికి తగిన గుర్తింపుతోపాటు పదవులు లభిస్తాయన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.
వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే.. ప్రభుత్వం కనీస ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. ఆరుతడి పంటల సాగు విధానంపై అవగాహన కల్పించడం లేదన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ బానోత్ హరిసింగ్‌నాయక్, సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్‌రావు, నాయకులు భూక్య దళ్‌సింగ్‌నాయక్, బొమ్మెర్ల వరప్రసాద్, సర్పంచులు బోడ బాలు, కుంజా సుగుణ, ఆమెడ రేణుక, ఎట్టి ప్రసాద్, పూజారి వెంకట్, బానోత్ రామా, తేజావత్ రవి, భూక్య బాలకృష్ణ, ఇర్పా లక్ష్మీనారాయణ, వీరభద్రం, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.