ఎదులాపురం, జూలై 18 : ఆదిలాబాద్ జిల్లాలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాను టూ టౌన్ పోలీసులు ఛేదించారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. గతేడాది డిసెంబర్ 23న జైనథ్ మండలానికి చెందిన ఫొటోగ్రాఫర్ కుంట రవితేజ తన పల్సర్ మోటార్ సైకిల్‌ను ఆదిలాబాద్ పట్టణంలోని రవితేజ హోటల్ సమీపంలో పార్ చేయగా గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు.
ఈ ఘటనపై ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజీలు, సమాచార వ్యవస్థ సహకారంతో దర్యాప్తు నిర్వహించిన పోలీసులు కరణ్ షిండే, మేశ్రం సాయికిరణ్, పవార్ విక్రమ్, ఫర్దీన్ ఖాన్‌లను అరెస్ట్ చేశారు. అబ్దుల్ సాహిల్, అజర్ ఖాన్ అలియాస్ ఎమ్రోజ్ ఖాన్, పొల్లేకర్ గణేశ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్‌రెడ్డి, టూ టౌన్ సీఐ నాగరాజు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్ఐలు ప్రణయ్, విష్ణు ప్రకాశ్ పాల్గొన్నారు.