భద్రాచలం, ఏప్రిల్ 21 : భద్రాద్రిలో ఉప ఎన్నిక వస్తే ఎగిరేది గులాబీ జెండాయేనని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోకెల్లా భద్రాచలం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా తెల్లం వెంకట్రావును ఇక్కడి ప్రజలు గెలిపిస్తే.. అతడు కాంగ్రెస్లో చేరి ద్రోహిగా మారారని విమర్శించారు. భద్రాద్రి జిల్లాలో సోమవారం పర్యటించిన ఆమె.. తొలుత భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఇక్కడి హరిత టూరిజం హోటల్లో భద్రాచలం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతోనూ, జిల్లాలోని ఉద్యమకారులతోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమకారులు కలిసి ప్రజల వెంటే ఉండాలని, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషిచేస్తూ భవిష్యత్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను గెలిపించేలా అండగా నిలవాలని కోరారు. తెలంగాణను కాంగ్రెస్ సర్కారు ఇప్పటికే ఆగం చేస్తోందని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఏమరుపాటుగా ఉంటే మరింత ఆగం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోసపోతే గోస మిగులుతుందంటూ గతంలో కేసీఆర్ పదేపదే చెప్పారని గుర్తు చేశారు. మోసం చేయడమనేది కాంగ్రెస్ నైజమని స్పష్టం చేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు, పార్టీ శ్రేణులకు, ఉద్యమకారులకు మధ్య తాను వారథిగా ఉంటానని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కార్యకర్తలు, ఉద్యమకారుల సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా కృషిచేస్తానని అన్నారు. కార్యకర్తలు, ఉద్యమకారులను కాపాడుకోవడాన్ని తన బాధ్యతగా భావిస్తానని అన్నారు. అలాగే, తెలంగాణను కాపాడుకోవడం కూడా బీఆర్ఎస్ శ్రేణుల ప్రథమ కర్తవ్యమని అన్నారు. బీఆర్ఎస్ పాలనా సారథ్యంలోని పదేళ్లలో రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో కొందరికి న్యాయం జరగకపోయినా వారంతా కేసీఆర్ వెంటే నడుస్తూ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారని గుర్తుచేశారు. ఇకపై వారి శ్రమ వృథాగా పోదని స్పష్టం చేశారు.
రైతులకు, రైతు కూలీలకు ఆత్మీయ భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని కవిత విమర్శించారు. కళ్లెదుటే తెలంగాణ ఆగమవుతుంటే ప్రజలతోపాటు పార్టీ కార్యకర్తలు, ఉద్యమకారులు చూస్తూ ఊరుకోవద్దని కోరారు. అప్పులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విపరీతమైన అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. లెక్కలు అడిగితే చెప్పబోమనడమేంటని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకు మంచి చేసినా, చెడు చేసినా ఆ లెక్కలను ప్రభుత్వం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆసుపత్రులు, హాస్టళ్లు సహా అన్ని వ్యవస్థలూ నిధుల్లేక నీరసించిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసరా పింఛన్లను పెంచనే లేదని, తమ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రూ.2,016 పింఛన్లనే ఇప్పటికీ ఇస్తున్నారని అన్నారు. పింఛన్దారుల ఉసురు తప్పక తగులుతుందని స్పష్టం చేశారు. అలాగే, కాంగ్రెస్ వస్తే కరువొచ్చినట్లేనని మరోసారి రుజువైందని, దీనిని ప్రజలు కూడా గమనిస్తున్నారని అన్నారు.
రూ.1.60 లక్షల కోట్లకు పైగా అప్పు తెచ్చి ఏం చేశారని ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బుకాయిస్తోందని, చెప్పబోమంటోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. రూ.40 వేల కోట్ల విలువైన భూములను రూ.10 వేల కోట్లకు తాకట్టు పెట్టిందని విమర్శించారు. అయితే ఆ రూ.10 వేల కోట్లతో రైతుభరోసా ఇచ్చామని, రుణమాఫీ చేశామని మంత్రులు చెబుతుండడం సిగ్గుచేటని అన్నారు.
ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా మూడు పైసలు కూడా తేలేదని ఎద్దేవా చేశారు. కానీ.. కేసీఆర్ మాత్రం ఆనాడు ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సీతారామ ప్రాజెక్టును తెచ్చి లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందేలా చేశారని గుర్తుచేశారు. 1969లో ఖమ్మం జిల్లాలోనే తెలంగాణ ఉద్యమం మొదలైందని జ్ఞప్తికి తెచ్చారు. తెలంగాణను కాపాడుకోవాలంటే గులాబీ కండువానే శ్రీరామరక్ష కావాలని స్పష్టం చేశారు. అది కార్యకర్తలు, ఉద్యమకారుల చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు.
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు బానోతు హరిప్రియ, వనమా వెంకటేశ్వరరావు, బానోతు చంద్రావతి, బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు మానే రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్, ఉద్యమకారులు బొమ్మెర రామ్మూర్తి, దేవీలాల్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, బీఆర్ఎస్ పాలనలోని పదేళ్లలోనూ ఈ జిల్లాకు ఎక్కువ నిధులిచ్చి అభివృద్ధికి పాటుపడ్డారని పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు గుర్తుచేశారు. ఈ ప్రాంత బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు సీతారామ ప్రాజెక్టును నిర్మించిన అపర భగీరథుడు కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, మళ్లీ కేసీఆరే రావాలంటూ బలంగా కోరుకుంటున్నారని అన్నారు.
బీఆర్ఎస్ అధినేత, ఉద్యమసారథి కేసీఆర్ బాటలోనే ఉద్యమకారులు కూడా నడుస్తున్నారని, ఆయన మాటే ఉద్యమకారులకు వేదవాక్కని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, ఉద్యమకారుడు దిండిగాల రాజేందర్ అన్నారు. పదేళ్ల కాలంలో ఉద్యమకారులకు ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. రానున్న రోజుల్లో ఉద్యమకారుల సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని కవితకు విన్నవించారు.
తొలుత భద్రాచలం చేరుకున్న కవిత.. ఉదయం శ్రీసీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు దేవస్థాన అర్చకులు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. తొలుత ధ్వజస్తంభం వద్ద, తరువాత గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు, శేషవస్ర్తాలు అందజేశారు. అనంతరం ఆలయంలోని ఉప ఆలయాలను కూడా కవిత దర్శించుకున్నారు.