కూసుమంచి, జూన్ 8 : తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, అక్కడే నాణ్యమైన విద్య లభిస్తుందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. కూసుమంచి మండల కేంద్రంలో హెచ్ఎం రాయల వీరస్వామి అధ్యక్షతన శనివారం జరిగిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రావీణ్యత గల ఉపాధ్యాయులు, సిబ్బంది, కావాల్సిన వసతులు, వనరులు ఉన్నాయన్నారు. కూసుమంచి హైస్కూల్లో అత్యధికంగా విద్యార్థులు ఉండడం పట్ల పాఠశాల సిబ్బందిని ఆయన అభినందించారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టారని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు, కళాశాలలు ఏర్పాటు చేసిందని, వీటిలో పూర్తిగా సీట్లు నిండే విధంగా తమ పిల్లలను వాటిలోనే చేర్పించాలన్నారు. అనంతరం కూసుమంచి శివాలయం రోడ్డులో పలు ఇండ్లకు ఉపాధ్యాయులతో వెళ్లి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా పదో తరగతిలో 9.7 జీపీఏ సాధించిన విద్యార్థిని మహాలక్ష్మిని అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రేలా విక్రమ్‌రెడ్డి, శోభన్, శ్రీను, ప్రైమరీ పాఠశాలల హెచ్ఎంలు, సీఆర్పీలు జాఫర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.