ఖమ్మం, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రతి పంటకూ బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు అధికారంలోకి వచ్చాక బోగస్ అయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఫలితంగా అన్నదాతలు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం ఖమ్మం ఏఎంసీని సందర్శించిన హరీశ్.. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డిలతో కలిసి పత్తియార్డును పరిశీలించారు.
అక్కడి పత్తి పంటను చూసి రైతులతో ముఖాముఖి అయ్యారు. ధరల విషయం వారి కష్టాలను తెలుసుకున్నారు. అనంతరం వారితోనూ, అక్కడే ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలోనూ ఆయన మాట్లాడారు. వరంగల్‌లో జరిగిన ఎన్నికల సభ (రైతు డిక్లరేషన్)లో రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ తుంగలో తొక్కి అన్నదాతలను అపహాస్యం చేసిందని విమర్శించారు. ఏ పంటకూ మార్కెట్లో గిట్టుబాటు ధర రావడం లేదని అన్నారు. అకాల వర్షాలు, వరదల వల్ల రైతులు తమ పంటలను నష్టపోయినా ప్రభుత్వం పరిహారం అందించలేదని ఆరోపించారు.
చివరికి పత్తికి కూడా రూ.6 వేల నుంచి రూ.6,500 మధ్య మాత్రమే ధర పలుకుతోదంటూ రెక్కలు ముక్కలు చేసుకున్న రైతులు రోదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా రైతులను ఎందుకు కలవలేకపోతున్నారని ప్రశ్నించారు. 25 లక్షల టన్నుల పత్తి కొంటామని చెప్పిన ప్రభుత్వం పెద్దపెద్ద ప్రకటనలు చేసి చివరికి లక్ష మెట్రిక్ టన్నులు కూడా కొనలేదని దుయ్యబట్టారు. దీంతో రైతుల పంట పూర్తిగా దళారుల పాలైందన ధ్వజమెత్తారు. ఎంతసేపూ ప్రతిపక్షాలను ఇబ్బందులను గురిచేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు తప్ప ప్రజలను, రైతులను కనీసంగానైనా పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు.
హామీలను గాలికొదిలి అన్నదాతలను విస్మరించారని విమర్శించారు. ‘రుణమాఫీ చేయలేదు. రైతుబంధు ఇవ్వలేదు. కౌలు రైతులను ఆదుకోలేదు. పంటల బీమా జాడ చెప్పలేదు. వ్యవసాయ కూలీలను విస్మరించారు.. మొత్తంగా రైతాంగాన్నే నిలువునా ముంచారు.’ అంటూ నిప్పులు చెరిగారు. మద్దతు ధర రాక ప్రతి రైతు క్వింటాకు రూ.1500 వరకు నష్టపోతుంటే మార్కెట్లో సీసీఐ కేంద్రం ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఇదే మార్కెట్లో నిరుడు రూ.11 వేలు పలికిన పత్తి ధర ఇప్పుడు రూ.6,500కు మించకపోవడానికి కారణమేంటని నిలదీశారు. పత్తి రైతుకూ రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సవాలక్ష కొర్రీలు పెట్టి అన్నదాతలను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, దళారుల వద్ద మాత్రమే పంటను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. మిర్చి రైతులూ ఇలాగే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిరుడు రూ.22 వేలు వరకు పలికిన క్వింటా ధర ఈ ఏడాది రూ.13 వేలకు మించి పలకడం లేదని అన్నారు. ముగ్గురు మంత్రులూ ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు మాత్రమే ఆలోచన చేస్తున్నారు తప్ప ప్రజలను, రైతులను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
జిల్లాలో ఈ ఏడాది నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే ఇప్పటి వరకూ 19 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఎలా కొనుగోలు చేశారని ప్రశ్నించారు. ఇందులో ఒక్క రైతుకు కూడా బోసన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ మాటలకు, కమిషనర్ మాటలకు పొంతన లేకుండా ఉందని అన్నారు. లిక్కర్ అమ్మకాలు కాకపోతే ఎంతో బాధ కలుగుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి పంటల ధరలు పడిపోతుంటే బాధ కలగడం లేదా? అని ప్రశ్నించారు.
తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా చేసేందుకు సీఎం మద్యం విక్రయాలను పెంచుతున్నాని, అమ్మకాలు లేనిచోట అధికారులకు మెమోలు జారీ చేయడం హాస్యాస్పదమని అన్నారు. ‘ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నటికీ బాగుపడదు..’ అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై ప్రేమ ఉంటే పది రకాల పంటలకూ రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోత్ చంద్రావతి, కొండబాల కోటేశ్వరరావు, రాష్ట్ర, జిల్లా నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, గొలుసు శ్రీనివాసయాదవ్, లింగాల కమల్‌రాజు, బొమ్మెర రామ్మూర్తి, కూరాకుల నాగభూషణం, ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, బచ్చు విజయ్‌కుమార్, బెల్లం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.