కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 28 : కొత్తగూడెం-పాల్వంచ పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.4.50 కోట్ల వ్యయంతో రింగ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు లభించినట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెం పట్టణంలోని 3, 4, 23, 32, 33, 34 వార్డుల్లో రూ.4.50 కోట్ల డీఎంఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ, బీటీ రోడ్లు, పార్కుల అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తగూడెం ఉమెన్స్ కాలేజీ నుంచి పాత కొత్తగూడెం మీదుగా బైపాస్ రోడ్డు వరకు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించే బీటీ రోడ్డుతో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.
రూ.9.20 కోట్ల వ్యయంతో పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, పాల్వంచ, కొత్తగూడెం పట్టణాలు, పరిసర ప్రాంతాలను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియను అధికార యంత్రాంగం ప్రారంభించిందన్నారు. వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ తరహాలో కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను మహా నగరాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, కమిషనర్ శేషాంజన్ స్వామి, తహసీల్దార్ పుల్లయ్య, ఆర్అండ్బీ డీఈ రవికుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.