కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 27: ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని, మున్సిపాలిటీ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 6 నుంచి 12వ వార్డుల్లో రూ.4.70 కోట్ల డీఎంఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైన్లు, పార్కుల నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. పూర్తయిన పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కూనంనేని మాట్లాడుతూ పది నెలల కాలంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించానన్నారు. మున్సిపాలిటీ పరిధిలో అంతర్గత రోడ్లు, పారిశుధ్య సమస్యల పరిష్కారం, డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, తహసీల్దార్ పుల్లయ్య, కమిషనర్ శేషాంజన్ స్వామి, ఇరిగేషన్ డీఈ రవికుమార్, కౌన్సిలర్లు కంచర్ల జమలయ్య, భూక్యా శ్రీనివాస్, మునిగడప పద్మ, బోయిన విజయ్‌కుమార్ పాల్గొన్నారు.