కూసుమంచి, నంవంబర్ 25: సంక్షేమ పథకాల సారథి సీఎం కేసీఆర్ అని పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని గుర్తుచేశారు. కూసుమంచి మండలంలో శనివారం పర్యటించిన ఆయన.. మండల కేంద్రంలో రాత్రి నిర్వహించిన రోడ్‌షో, ప్రచారంలో మాట్లాడారు. వలస పాలకుల ఏలుబడిలో వెనుకబడిన తెలంగాణను అన్నీ రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించిందని అన్నారు. ఈ అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, ప్రజలు కలలుగన్న తెలంగాణ పూర్తి కావాలన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి విజయం సాధించాలని అన్నారు. అందుకోసం ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
అలాగే, స్థానికుడినైన తాను ఇక్కడి ప్రజలతో కలిసి ఉంటున్నానని, వారి కష్టసుఖాల్లో పాల్పంచుకుంటున్నానని అన్నారు. ప్రభుత్వ అందించే నిధులతోపాటు తన సొంత నిధులు కూడా వెచ్చించి గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్నానని వివరించారు. ఎన్నిలప్పుడు వచ్చే బయటి వ్యక్తులు ఎప్పటికీ శాశ్వతం కాదని అన్నారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను అధిక మెజార్టీ అందించాలని కోరారు. నేలకొండపల్లి రోడ్డు నుంచి రామాలయం సెంటర్ మీదుగా బస్టాండ్ వరకు ర్యాలీలో కొనసాగింది. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బానోత్ చంద్రావతి, తాళ్లూరి జీవన్‌కుమార్, రామసహాయం బాలకృష్ణారెడ్డి, బానోత్ శ్రీనివాస్, ఇంటూరి బేబీ, ఇంటూరి శేఖర్, వేముల వీరయ్య, ఆసీఫ్, కొక్కిరేణి సీతారాములు పాల్గొన్నారు.