కూసుమంచి, ఆగస్టు 6 : పాలేరు నియోజవర్గంలోని తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో పేదలు గిరిజనులు, దళితులు ఎక్కువగా ఉన్నారని వారికి వైద్యం కోసం ప్రస్తుతం ఉన్న ఆసుపత్రుల స్థాయిని పెంచాలని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావును కోరారు. అసెంబ్లీ సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ పాలేరు నియోజవర్గ సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. తిరుమలాపాలెం మండల కేంద్రంలో కొత్తగా ఆసుపత్రి నిర్మాణం జరిగిందని స్థాయిని 100 పడకలకు పెంచాలన్నారు. సూర్యాపేట-ఖమ్మం మధ్య 70 కి.మీ దూరంలో ప్రధాన కేంద్రమైన కూసుమంచిలో ఉన్న ఆసుపత్రి స్థాయిని 50 పడకలకు పెంచాలని కోరారు. ఇటీవల వర్షాల కారణంగా వరదలకు నర్సింహులగూడెం-నేరడవాయి రోడ్డు, నర్సిహులగూడెం వద్ద చప్టాతోపాటు దుబ్బతండా రోడ్లు సుమారు 8 కి.మీ బాగా దెబ్బతిన్నాయని వాటి మరమ్మతులకు నిధులు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే కందాళ ప్రశ్నకు మంత్రి జగదీశ్‌రెడ్డి సమాధానం ఇస్తూ వివరాలు నోట్ చేసుకున్నామని పేర్కొన్నారు. రహదారుల విషయంలో ఇప్పటికే క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.