ఖమ్మం రూరల్, ఏప్రిల్ 25 : సీఎం కేసీఆర్‌తోనే దేశాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోకెల్లా తెలంగాణ రాష్ట్రమే నెంబర్ వన్‌గా ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ 22వ నియోజకవర్గ స్థాయి ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మండల కేంద్రంలోని చల్లపల్లి గార్డెన్లో మంగళవారం నిర్వహించిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణను సాధించిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సాధించడమేగాక అభివృద్ధి, సంక్షేమంలో అనతి కాలంలోనే దానిని ముందువరుసలో నిలిపిన ఘనత కూడా సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. ఇంతటి అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మరోమారు అధికారంలోకి రావాలంటే కార్యకర్తలు, నాయకులు ఇప్పటినుంచే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో మరింత విస్తృత ప్రచారం జరగాల్సి ఉందని అన్నారు. శ్రేణులన్నీ ఆ దిశగా ముందుకెళ్లాలని సూచించారు.
మరోసారి బీఆర్ఎస్ విజయం ఖాయం
-పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి
తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఇప్పటి నుంచే కార్యకర్తలు, నాయకులు కార్యాచరణ సిద్ధం చేసుకొని పనిచేయాలని సూచించారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్టసుఖాలు తెలుసుకోవాలన్నారు. వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. బీజేపీ పాలనలో యావత్ దేశం అనేక అవస్థలు పడుతోందని విమర్శించారు. దేశం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించడం కేవలం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. దేశ ప్రజలు కూడా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు.
కొద్దిరోజుల్లోనే పాలేరుకు గోదావరి జలాలు
-రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
మరికొద్ది రోజుల్లోనే పాలేరు జలాయశయంలోకి గోదావరి జలాలు వస్తాయని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. తద్వారా పాలేరు ప్రాంతం మరింత అభివృద్ధి చెందతుందని స్పష్టం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపే సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిత్యం పనిచేస్తున్న సీఎంకు ప్రతి ఒక్కరి ఆశీర్వాదమూ కావాలని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సీజనల్ నాయకుల రాక ప్రారంభమవుతుందని అన్నారు. అలాంటి వారి మాటలను నమ్మవద్దని సూచించారు.
ఆరు తీర్మానాల ఆమోదం..
ప్రతినిధుల సభలో ఆరు తీర్మానాలను ఆమోదించారు. బీజేపీ ప్రజావ్యతిరేక పాలనపై బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, విద్యావైద్యంపై కూసుమంచి మండల నాయకుడు అసీఫ్, దళితబంధుపై తిరుమలాయపాలెం ఎంపీపీ బోడ మంగీలాల్, రైతుబంధుపై డీసీసీబీ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, సబ్బండవర్గాల సంక్షేమంపై కూసుమంచి ఎంపీపీ శ్రీనివాస్, అభివృద్ధి పనులపై బీఆర్ఎస్ నాయకుడు నెన్నెబోయిన శ్రీనివాస్ తీర్మానాలు ప్రవేశపెట్టగా ప్రతినిధులు ఆమోదించారు. బీఆర్ఎస్ నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు ఇంటూరి శేఖర్, చావా వేణు, నూకల సైదులు, మరకింటి ధనలక్ష్మి, గూడ సంజీవరెడ్డి, బెల్లం ఉమ, రమ్య, ఉన్నం బ్రహ్మయ్య, వేముల వీరయ్య, బాషబోయిన వీరన్న, ఇంటూరి బేబీ, బాలకృష్ణారెడ్డి, నిరంజన్, లలిత తదితరులు పాల్గొన్నారు.