భద్రాచలం, ఫిబ్రవరి 3: కాంగ్రెస్ ప్రభుత్వానివన్నీ 420 హామీలేనని, ఆరు గ్యారెంటీల అమలు సాధ్యమయ్యే పని కాదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. భద్రాచలం పట్టణంలోని కేకే కల్యాణ మండపంలో శనివారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అరికెళ్ల తిరుపతిరావు అధ్యక్షతన నిర్వహించిన పార్టీ లోక్‌సభా ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెల డిసెంబర్ 9 నుంచి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఊదరగొట్టిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు మాట మార్చి, రాహుల్‌గాంధీ ప్రధాని అయితేనే అమలు చేస్తామనడం విడ్డూరమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాహుల్‌గాంధీ ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గోబెల్స్ ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కొనే దమ్మూ ధైర్యం ఒక్క బీఆర్ఎస్కే ఉందన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత కష్టపడి బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావును ఎమ్మెల్యేగా గెలిపించారో, అదే రీతిగా పనిచేసి మానుకోట ఎంపీ స్థానంలో విజయబావుటా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. గతంలో బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని తమ పార్టీపై విషప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీతో దోస్తీ కడుతున్నదని మండిపడ్డారు. ఏపీలో కలిపిన ఏడు మండలాల జీవోను ఆమోదించింది నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తున్నదన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ర్టాన్ని దేశానికి దిక్సూచిగా మార్చారని కొనియాడారు. ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారన్నారు. నిరుపేద బిడ్డలు మెడికల్ సీటు సాధించేందుకు బాటలు వేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా గ్యారెంటీలకు దిక్కులేదని ధ్వజమెత్తారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 543 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ కనీసం 40 స్థానాలనైనా దక్కించుకోలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఇండియా కూటమి నుంచి కేరళ సీఎం విజయన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీహార్ సీఎం నితీశ్‌కుమార్ తప్పుకున్నారని, ఇక కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో చుక్కెదురేనని స్పష్టం చేశారు. భద్రాచలంలో గోదావరి పక్కన కరకట్ట నిర్మించేందుకు కేసీఆర్ ప్రభుత్వం గతంలోనే రూ.39 కోట్లు మంజూరు చేసిందని, టెండర్ల ప్రక్రియ సైతం చేపట్టిందని గుర్తుచేశారు. పట్టణవాసులు అధైర్యపడొద్దన్నారు.
అనంతరం బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకొని మృతిచెందిన వారి పలు కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున బీమా చెక్కులు అందజేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ.. ఓటమిని మరచిపోయి కార్యకర్తలు లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీ కవిత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు అని కొనియాడారు. పోడు భూములకు పాస్‌బుక్‌లు అందజేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మి ఎన్నికల్లో గెలిపిస్తే, ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేయలేదని మండిపడ్డారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనడం కేవలం అహంకారమేనన్నారు. భద్రాచలం రెండో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని తాము కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరామని, అయినా స్పందన లేదన్నారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో భద్రాచలంలోని మారుమూల గ్రామాలకూ తాను వెళ్లానని, ఎంతో పని చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్రావును గెలిపించుకున్నామన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. మారుమూల గ్రామాలకూ మిషన్ భగీరథ జలాలను అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కూడా తమకే దక్కుతుందన్నారు. ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్, బీఆర్ఎస్ నాయకులు దిండిగాల రాజేందర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, అరికెళ్ల తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి, మానె రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్, తాళ్లపల్లి రమేశ్ గౌడ్, బొలిశెట్టి రంగారావు, రేపాక పూర్ణచంద్రరావు, తాండ్ర నరసింహారావు, ఎల్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.