భద్రాచలం, డిసెంబర్ 10: ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పిలుపునిచ్చారు. భద్రాచలంలోని బస్టాండ్‌లో ఆదివారం ఆయన ఆర్టీసీ అధికారులతో కలిసి ‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించి మాట్లాడారు. మహిళలు కేవలం ఆధార్ కార్డు చూపించి ప్రయాణం సాగించవచ్చన్నారు. అనంతరం భద్రాచలం ఐటీడీఏ పీవో బస్టాప్‌కు వెళ్లి మహిళలతో ముచ్చటించారు. అనంతరం ప్రయాణికులతో కలిసి బస్సులో కొద్దిదూరం ప్రయాణం సాగించారు. ఎమ్మెల్యే వెంట దుమ్ముగూడెం జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, ఎంపీపీలు రేసు లక్ష్మి, కోదండరామయ్య, ఆర్డీవో మాలోతు మంగీలాల్, ఆర్టీసీ డీఎం రామారావు, తహసీల్దార్ శ్రీనివాస్ ఉన్నారు.
రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచడం అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఆదివారం ఆయన ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్‌తో కలిసి ఆరోగ్యశ్రీ బ్రోచర్లను ఆవిష్కరించి మాట్లాడారు. తాను గతంలో ఇదే ఆసుపత్రిలో ప్రజలకు వైద్యుడిగా సేవలందించానని, మళ్లీ ఇదే ఆసుపత్రికి ఎమ్మెల్యేగా రావడం ఆనందాన్నిచ్చిందన్నారు. ఆసుపత్రిలో పొరుగు రాష్ర్టాలకు చెందిన ప్రజలూ వైద్యం చేయించుకోవడం విశేషమన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో సరిపడినంత మంది డాక్టర్లు, నర్సుల లేరని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఐటీడీఏ పీవో ప్రతీక్‌జైన్ మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మాలోతు మంగీలాల్, డీసీహెచ్ఎస్ రవిబాబు, ఆర్ఎంవో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్, చర్ల ఎంపీపీ గీదా కోదండరామయ్య ఉన్నారు.