కారేపల్లి, మార్చి 26 : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరంగా మారింది. పర్యవేక్షించాల్సిన అధికారులే భక్షకులుగా మారిన వైనం. దొంగ లెక్కలతో అందిన కాడికి దోచుకుంటున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఉపాధి హామీ పనుల్లో నాణ్యత లేదని, పనులకు సంబంధించిన నిధులను అధికారులతో కలిసి పక్కదారి పట్టించినట్లు, రికార్డుల్లో మొక్కల పెంపకంపై బిల్లులు పెద్ద మొత్తంలో స్వాహా చేసినట్లు ఉపాధి హామీ సామాజిక తనిఖీలో బహిర్గతమైంది. మంగళ, బుధవారాల్లో ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రమైన కారేపల్లి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఏడాది పాటు చేపట్టిన ఉపాధి హామీ పనులపై డీఆర్డీఓ ఏపీడీ చుంచు శ్రీనివాసరావు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తూ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కల పెంపకం సరిగ్గా లేదని, మొక్కల పెంపకానికి నిధుల దుర్వినియోగం జరిగినట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తనిఖీ బృందం గుర్తించింది. మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల చెల్లింపుల్లోనూ అనుమానాలు ఉన్నాయని కొంతమంది ఆరోపించారు. మండల వ్యాప్తంగా 41 గ్రామ పంచాయతీలకు గాను రూ.2,36,237 దుర్వినియోగం చేసినట్లు తేలింది. దీంతో రూ.1,15,000 జరిమానా, ఒక లక్ష ఇరవై ఒక్క వేలు రికవరీ, పంచాయతి రాజ్ శాఖకు సంబంధించి రూ.15,532 రికవరీకి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 15 రోజుల్లో ఇందుకు సంబంధించి రికార్డుల పునర్ పరిశీలన చేసి తిరిగి దాఖలు చేస్తే జరిమానా, రికవరీల్లో మినహాయింపులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవీఓ సక్రియ, ఏవీఓలు పవన్ కుమార్, శాస్త్రి, ఏపీడీ శ్రీదేవి, ఎంపీడీఓ సురేందర్, ఎంపీఓ రవీందర్, క్వాలిటీ కంట్రోల్ అధికారి వీరయ్య, సిబ్బంది రమేశ్‌బాబు, గంగరాజు, రజిత, అజయ్‌కుమార్, కోటేశ్వరరావు, సుధీర్ పాల్గొన్నారు.