ఉమ్మడి రాష్ట్రంలో గుక్కెడు నీటికోసం ఏజెన్సీవాసులు అరిగోస పడ్డారు. తలాపునే గోదారి ఉన్నా.. గొంతు తడవని పరిస్థితి. మైళ్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకుని అవసరాలు తీర్చుకునేవారు. వాగులు, వంకలు, చెరువుల్లో చెలిమలు తీసుకొని ఆ నీటినే తాగి రోగాలబారిన పడిన సందర్భాలూ ఉన్నాయి. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజల క‘న్నీటి’ కష్టాలు తీర్చేందుకు మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇక మహిళలు బిందెలు పట్టుకొని బయటకు వెళ్లొద్దనే ఉద్దేశంతో ఇంటింటికీ నల్లాలు బిగించి శుద్ధజలం అందిస్తున్నారు.
భద్రాద్రి డివిజన్లో రూ.50 కోట్లతో చేపట్టిన పనులు 95శాతం పూర్తయ్యాయి. ఇంటింటికీ శుద్ధ జలాలు అందుతున్నాయి. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోనూ కొండలు, గుట్టలు ఎక్కి ‘భగీరథ’ పరుగులు పెడుతున్నది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దున ఉన్న గ్రామాల ప్రజలకూ రక్షితనీరు అందుతుండడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దశాబ్దాలుగా తాగునీటి కోసం అల్లాడిన బతుకులకు కేసీఆర్ ‘అపర భగీరథుడు’ అయ్యాడని ఏజెన్సీవాసులు కీర్తిస్తున్నారు. ఏజెన్సీ దాహార్తి తీర్చిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.
– భద్రాచలం, డిసెంబర్ 10
మైళ్ల దూరం వెళ్తేనే బావి జలం!!
బావిలో నుంచి ప్రమాదకరంగా నీటి తోడుకుంటున్న ఈ దృశ్యం దుమ్ముగూడెం మండలం ములకానపల్లిలోనిది. ఈ గ్రామం ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉంటుంది. గతంలో ఇక్కడి ప్రజలు 10కిలో మీటర్లు దూరం వెళ్లి నెత్తిన, కావడికి బిందెలు కట్టుకొని తాగునీటి తెచ్చుకునేది. ఆనాటి నీటికష్టాలు యాదికొస్తే గుండె బరువయితదని గిరిజనులు వాపోయారు. సీఎం కేసీఆర్ ‘మిషన్ భగీరథ’తో మా నీటిగోస తీర్చారని సంతోషం వ్యక్తం చేశారు.
ఇంటి వద్దే శుద్ధ జలం
ఈ చిత్రంలోని మహిళది దుమ్ముగూడెం మండలంలోని ఆర్లగూడెం. గతంలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని వాపోయింది. ఆనాటి నీటి కష్టాలు యాదికి తెచ్చుకొని బాధపడింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం ‘మిషన్ భగీరథ’తో ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిందని సంతోషం వ్యక్తం చేసింది. మారుమూల పల్లెల్లోనూ ఇంటింటికీ నల్లా బిగించి శుద్ధజలం అందించడంతో ప్రజలు కష్టాలు తీరాయని పేర్కొన్నది.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలు గోస పడకూడదని, ఫ్లోరోసిస్ బారినపడి అనేకమంది కాళ్లు, చేతులు వంకర్లుపోయిన దుస్థితిని కళ్లారా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించేందుకు రూ.42 వేల కోట్లతో ‘మిషన్ భగీరథ’ పథకాన్ని ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న కేసీఆర్, మిషన్ భగీరథ పథకంతో మారుమూల గ్రామాల ప్రజలకు కూడా రక్షిత తాగునీరు అందిస్తున్నారు.
రూ.50 కోట్లతో ‘భగీరథ’ పనులు
భద్రాచలం పట్టణంతోపాటు దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో మిషన్ భగీరథ పనులను రూ.50 కోట్లతో 2016లో ప్రారంభించారు. నేడు ఆయా మండలాల్లో 95శాతానికి పైగా మిషన్ భగీరథ పనులు పూర్తయి, ఇంటి వద్దనే నల్లా ద్వారా రక్షిత నీటిని ప్రజలు తాగుతున్నారు. 2016కు ముందు భద్రాచలం పట్టణంలో 4,522 నల్లాలు మాత్రమే ఉండేవి. శివారు కాలనీలు, భగవాన్‌దాస్ కాలనీ, ఏఎంసీ కాలనీతోపాటు పలు కాలనీల్లో గోదావరి నల్లాలు ఉండేవి కావు. దీంతో ఆయా కాలనీలవాసులు పొద్దుగాలనే సైకిళ్లు, మోటారు సైకిళ్లు, ఆటోల ద్వారా రంగనాయకుల గుట్టపై ఉన్న నల్లా వద్ద, ప్రభుత్వ
జూనియర్ కళాశాల క్రీడా మైదానం వద్ద ఉన్న నల్లా దగ్గర, కాపునాడు బస్టాండ్ వద్ద ఉన్న నల్లా వద్ద గుమిగూడి తాగునీటి కోసం కొట్లాడుకునే వారు. పట్టణంలో 110 కిలోమీటర్ల పైప్లైన్లు ఏర్పాటు చేసి ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తుండడంతో నేడు ఆ పరిస్థితి లేదు. దుమ్ముగూడెం, చర్ల మండలాలకు కూడా మిషన్ భగీరథ ద్వారా రక్షిత నీరు అందించేందుకు పర్ణశాల వద్ద ఇన్‌టేక్‌వెల్‌ను ఏర్పాటు చేసి, గ్రామగ్రామాన మంచినీటిని అందిస్తున్నారు.
24 గంటల్లో నల్లా ఏర్పాటు
మిషన్ భగీరథ పథకం ద్వారా ఏజెన్సీ, పట్టణ ప్రజలకు శాశ్వతంగా తాగునీరు లభిస్తున్నది. దరఖాస్తు చేసుకున్న 24గంటల్లో మిషన్ భగీరథ అధికారులు మంచినీటి నల్లాను ఏర్పాటు చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రజల కష్టాలు తీరిపోయాయి. భద్రాచలం ఏజెన్సీవ్యాప్తంగా తాగునీటి సమస్య పూర్తిగా తొలగిపోయింది. పట్టణంలో రూ.12 కోట్లతో పైప్లైన్లు, నల్లాల నిర్మాణం పనులు పూర్తి చేశారు. దుమ్ముగూడెం మండలంలో రూ.18 కోట్లతో 35 ట్యాంకులు, పైప్లైన్లు, 13వేల నల్లాలను ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తున్నారు.
చర్ల మండలంలో రూ.20 కోట్లతో 63 తాగునీటి ట్యాంకులు, 130 కిలోమీటర్లు పైప్‌లైన్ వేసి 9,500 నల్లాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మండలాల్లో 95శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని, మిగతా 5శాతం పనులను త్వరలో పూర్తి చేస్తామని డీఈ శ్రీనివాస్ తెలిపారు. పైప్లైన్లు వేసిన తరువాత రోడ్లు వేయడంతో పనులు ఆగిపోయాయని, త్వరలోనే వాటిని పూర్తిచేస్తామని పేర్కొన్నారు.
పేదలను ఆదుకున్న దేవుడు కేసీఆర్
ఏజెన్సీ ప్రజల తాగునీటి కష్టాలను రూపుమాపిన దేవుడు సీఎం కేసీఆర్. గోదావరి పక్కనే ఉన్నప్పటికీ మంచినీటి కోసం ఎంతోదూరం వెళ్లేవాళ్లం. ఇంటింటికీ తాగునీరు అందాలన్న మా చిరకాల వాంఛ కేసీఆర్ సార్‌తో తీరింది. నా భర్త చనిపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నాకు వితంతు పింఛన్ ఆసరాగా నిలిచింది. కేసీఆర్ సార్ దేశానికి ప్రధానిగా ఉంటే ఎన్నో రాష్ర్టాల ప్రజలకు మేలు కలుగుతుంది.
– కుర్రు తిరుపతమ్మ, ముదిరాజ్ బజార్, భద్రాచలం
తాగునీటి కష్టాలకు చెక్
భద్రాచలం పట్టణంలో మంచినీటి సమస్య నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఈ సమస్యను సీఎం కేసీఆర్ పరిష్కరించడం, డీఈగా అందులో నేను భాగస్వామిని కావడం నా అదృష్టం. వేసవికాలం వచ్చిందంటే ఏజెన్సీలో గిరిజనులు ఎంతోదూరం నడిచి వెళ్లి చెలిమల ద్వారా తాగునీటిని తెచ్చుకునేవారు. నేడు ఆ పరిస్థితి ఎక్కడా కానరాదు. ఇంటింటికీ నల్లా నీరు అందుతున్నది.
– శ్రీనివాస్, డీఈ