దుమ్ముగూడెం, మార్చి 30: రూ.లక్షల వ్యయంతో నిర్మించిన మిషన్ భగీరథ ట్యాంకు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారింది. నిండు వేసవి రాకముందే ఆ గ్రామానికి తాగునీటి కష్టాలను తెచ్చిపెట్టింది. మండలంలోని రామారావుపేటలో గత కేసీఆర్ ప్రభుత్వ పాలనలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు నిర్మించారు. పైపులైన్లు వేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారుల సమన్వయ లోపం వంటి కారణాలతో మంచినీరు సరఫరా కావడం లేదు. దీంతో గ్రామ శివారులోని ఓ బావి నుంచి ఆర్డబ్ల్యూస్ అధికారులు మోటరు అమర్చి గ్రామస్తులకు నీటిని సరఫరా చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేసవిలో మంచినీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకున్నా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాగునీటికి అవస్థలు పడుతున్నామని, నీరందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గ్రామస్తులు ఆరోపించారు. సంబంధిత శాఖల అధికారులు పైపులైను ద్వారా నీటిని సరఫరా చేయాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే గ్రామంలోని ఒడ్డుగుంపులో నాలుగు రోజుల క్రితం పైపులైన్లు వేసినప్పటికీ కొన్ని ఇళ్లకు వీటిని బిగించాల్సి ఉంది.
2 హెచ్పీ మోటరు ఏర్పాటు చేసి అక్కడి కుటుంబాలకు తాగునీరు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనిపై మిషన్ భగీరథ ఏఈని ‘నమస్తే’ వివరణ కోరగా.. పైపులైన్లు గతంలో వేశామని, ప్రెజర్ తక్కువగా ఉండడం వల్ల నీరు ట్యాంకులోకి ఎక్కడం లేదని అన్నారు. బూస్టర్ పైపు ద్వారా ట్యాంకులోకి నీటిని ఎక్కించేలా చర్యలు చేపట్టామని, అప్పటివరకు గ్రామ శివారులోని బావి ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామని సమాధానమిచ్చారు.
‘భగీరథ’ నీరు అందడంలేదు..
ప్రధాన రహదారికి రెండు కిలోమీటర్ల దూరంలో మా గ్రామం ఉంది. అయినా మిషన్ భగీరథ నీరు పైపులైను ద్వారా అందడం లేదు. గతంలో ట్యాంకు నిర్మించి పైపులైన్లు వేశారు. ఇప్పుడు మాత్రం భగీరథ నీటిని గ్రామానికి అందించడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలి. తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలి.
-కుర్సం పద్మావతి, రామారావుపేట