చండ్రుగొండ, ఆగస్టు 16 : మిషన్ భగీరథ నీరు రెండు నెలలుగా రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైపులైన్ దెబ్బతిని.. మోటరు మరమ్మతులకు గురైనా పట్టించుకునేవారు కరువయ్యారని ఆందోళన చెందుతున్నారు. చేసేది లేక చెడిపోయిన మంచినీటి పథకం వద్ద వంకనంబర్ గ్రామస్తులు, మహిళలు ఖాళీ బిందెలతో శుక్రవారం నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో వంద కుటుంబాలకు తాగునీరు లేక రెండు నెలలుగా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించే పైపులైన్ దెబ్బతిన్నదని, మోటర్ సైతం పని చేయకపోవడంతో రెండు నెలలుగా మంచినీరు రావడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
పంచాయతీకి నిధులు రాగానే మరమ్మతు చేయిస్తామని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని, రోజూ పంపుల ద్వారా నీరు వచ్చే విధంగా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు తెల్ల లక్ష్మి, పద్దం శాంతకుమారి, తాటి విజయకుమారి, కుంజ సుక్కమ్మ, యదలపల్లి పైలు, పైదమ్మ, కుంజ నర్సింహారావు, పైదబాబు, బొర్రా విజయ, కుంజా నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.