మధిర, జూన్ 16: రైతులు మధిర (Madhira) వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటుచేసిన మిర్చి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు అన్నారు. సోమవారం మధిర వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మిర్చి పంటకు జెండా పాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ రైతుకు చెందిన మిర్చిని రూ.14,511కు కొనుగోలు చేశారు.
అనంతరం నరసింహారావు మాట్లాడుతూ… రైతులు పండించిన పంటను దూర ప్రాంతాలకు వెళ్లి మిర్చిని అమ్ముకోకుండా మధిర మార్కెట్ యార్డ్లో కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. గతంలో రైతుల పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దొండపాడు వెంకటేశ్వరావు, మాజీ చైర్మన్ డాక్టర్ వాసిరెడ్డి రామనాదం, బంధం శ్రీనివాసరావు, మధిర ఏడీఏ స్వర్ణ విజయ్ చంద్ర, ఏవో సాయి దీక్షిత్, మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.