– ఏజెన్సీ నియోజకవర్గాలపై నిర్లక్ష్యం
– వైరా, ఇల్లెందు ఎమ్మెల్యేలు సాగునీరు కోసం గళం విప్పాలి
– సీతారామ ప్రాజెక్టు నిధుల లేమికి ముగ్గురు మంత్రులదే భాధ్యత
– తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు
కారేపల్లి, మార్చి 26 : ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు తమ సొంత నియోజకవర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ గిరిజన నియోజకవర్గాలకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, ఉపాధ్యక్షుడు దుగ్గి కృష్ణ విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాల భూమికి సాగు నీరు అందించే సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయాలని, అందుకు అవసరమైన నిధులు బడ్జెట్లో కేటాయింపులు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కారేపల్లి క్రాస్ రోడ్లో తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. వజ్జా రామారావు అధ్యక్షతన జరిగిన సదస్సులో వీరు పాల్గొని మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటకు అవసరమైన నిధులు బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా ముగ్గురు మంత్రులు తమ సొంత నియోజకవర్గ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ గిరిజన నియోజకవర్గాలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజన నియోజకవర్గాలకు సాగు నీరు అందించేందుకు వైరా, ఇల్లెందు ఎమ్మెల్యేలు గళం విప్పాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్ధిక సంవత్సరానికి శాసనసభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందించే సామర్థ్యం ఉన్న సీతారామ ప్రాజెక్టు మిగిలిన పనులకు రూ.9 వేల కోట్ల రూపాయలు అంచనా వేసినా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.336 కోట్లు కేటాయింపులు చేయుడంపై ముగ్గురు మంత్రులు బాధ్యత వహించాలన్నారు. గోదావరి నదిపై సీతమ్మ బ్యారేజి నిర్మాణం పూర్తి చేయకుండా సాగు నీరు 2026 ఆగస్టు 15 నాటికి అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైరా రైతు సభలో ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. కేసిఆర్ ప్రభుత్వం పూర్తి చేసిన పనుల ఆధారంగా నీరు కొన్ని ప్రాంతాలకు అందించే ప్రయత్నం తప్ప, పాలేరు రిజర్వాయర్ కు అనుసంధానం చేసే పనులు పూర్తి చేయడం లేదన్నారు. కారేపల్లి, కామేపల్లి రెండు మండలాల్లో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సాగు నీటి వనరులు కల్పించలేదన్నారు. బుగ్గ వాగు మీద విశ్వనాథపల్లి వద్ధ రాజ్యసభ మాజీ సభ్యుడు యల్లమంచిలి రాధాకృష్ణమూర్తి నిధుల నుండి ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేయక పోయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి అయినా ప్రధాన కాలువలు ఆధారంగా కామేపల్లి, కారేపల్లి మండలాల్లో భూములకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొండెబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఆక్స్ఫర్డ్, క్రేంబిడ్జి స్థాయిలో తెలంగాణ విద్యార్థులకు విద్యా అందించాలంటే ప్రభుత్వ విద్యా సంస్థలు అన్నింటిలో అత్యంత నాణ్యమైన వసతులు, సౌకర్యాలు కల్పించడంతో పాటు విద్యా వ్యవస్థలో ఉన్న అంతరాలను రూపు మాపాలన్నారు. ఇందిరమ్మ భీమా పథకం కుటుంబ సభ్యులు అందరికీ వర్తింపు చేయాలన్నారు. ఇండ్ల స్థలాలు లేని పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, అందుకు అవసరమైన నిధులు బడ్జెట్ లో కేటాయించాలని కోరారు. లోపభూయిష్టంగా ఉన్న విద్యా విధానం మూలంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, విద్యా విధానాన్ని అన్ని స్థాయిల్లో సంస్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సినీయర్ నాయకులు ఇంజం నాగభూషణం, సిఐటియు జిల్లా నాయకులు కుందనపల్లి నరేంద్ర, బాదావత్ శ్రీనివాసరావు, రైతు సంఘం మండల అధ్యక్షుడు ముళ్ల ఏకాంబరం, పాసిన్ని నాగేశ్వరరావు, కేసాగని ఉపేందర్, ఏడుకొండలు, రాంబాబు, విశ్వనాథ పల్లి ఉప సర్పంచ్ ధన్నం, సైదులు, నిర్వాసితుల సంఘం నాయకులు షరీఫ్, సంగెం వెంకన్న పాల్గొన్నారు.