భద్రాచలం, అక్టోబర్ 13: ‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులకు గిరిజన విద్యార్థులకు వండిపెట్టే హాస్టల్ కార్మికుల ఆకలి బాధలు కనిపించడం లేదా?’ అని డైలీవైజ్, అవుట్సోర్సింగ్ వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ.మధు ప్రశ్నించారు. ‘ఓట్లేసి గెలిపించిన పాపానికి గిరిజన కార్మికుల నోటికాడి బువ్వను గుంజుకుంటూ వారి జీతాలు తగ్గిస్తారా? అంటూ ధ్వజమెత్తారు.
తమ సమస్యలు పరిష్కరించాలని, జీవో 64ను రద్దు చేయాలని, అవుట్సోర్సింగ్ కార్మికులకు జీవో 60 ప్రకారం నెలకు రూ.15,600 వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత 32 రోజులుగా ఎక్కడికక్కడ గిరిజన ఆశ్రమ పాఠశాలల వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న గిరిజన ఆశ్రమ పాఠశాలల కార్మికులు, అవుట్ సోర్సింగ్ వర్కర్లు సోమవారం నుంచి 72 గంటలపాటు భద్రాచలం ఐటీడీఏ ఎదుట మహాధర్నా నిర్వహించాలని, అక్కడే వాంటావార్పు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం ఉదయమే భద్రాచలానికి చేరుకున్న భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల కార్మికులు ఐటీడీఏ ఎదుట బైఠాయించారు. అయితే ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అక్కడే భీష్మించారు. కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఐటీడీఏ ప్రధాన ద్వారాన్ని మూసివేసి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికులు తమ శిబిరం వద్దే భారీ వర్షంలోనూ వంటావార్పు నిర్వహించి అక్కడే భోజనాలు చేశారు.
ఈ సందర్భంగా డైలీవేజ్ వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ.మధు మాట్లాడుతూ.. గిరిజన కార్మికుల సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చదువుకోవాల్సిన విద్యార్థులు పొయ్యి దగ్గర మగ్గిపోతుంటే విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు క్లీనింగ్ పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని స్పష్టం చేశారు. రూ.లక్షల్లో జీతాలు తీసుకుటటున్న ప్రజాప్రతినిధులకు కార్మికుల ఆకలి బాధలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గిరిజన సంఘం నాయకులు, డైలీవైజ్ వర్కర్ల సంఘం జేఏసీ నాయకులు పాల్గొన్నారు.