భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
వీసీలో ఐడీవోసీ నుంచి కలెక్టర్ జితేశ్ వి పాటిల్, సీపీవో సంజీవరావు, పౌరసరఫరాల అధికారి త్రినాథ్‌బాబు, డీఎం నరేందర్, డీసీవో సయ్యద్ ఖుర్షీద్‌లు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై చేపట్టాల్సిన చర్యల గురించి ఆ శాఖ ప్రధాన కార్యదర్శి డీఎస్ చౌహాన్ దిశానిర్దేశం చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా జరిగేలా కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. సన్నరకం ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు.
కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి కొనుగోలు చేయాలని, తాలు పేరుతో కోత విధిస్తే సహించేది లేదన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం అమ్మిన రైతుల బ్యాంకు ఖాతాల్లో రెండు రోజుల్లో డబ్బులు జమ అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ జిరాక్సు కాపీ కొనుగోలు కేంద్రాల్లోనే అందజేస్తే రెండు రోజుల్లో డబ్బులు అకౌంట్లో జమ అవుతాయని పేర్కొన్నారు.