ఖమ్మం, అక్టోబర్ 9 : సీసీ రోడ్డు నిర్మాణ పనులు పది కాలాలపాటు మన్నికగా ఉండే విధంగా నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని 20వ డివిజన్ సాయి నగర్లో టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసిందన్నారు. అలాగే నగరంలో పెద్ద ఎత్తున చెట్లు పెంచి పచ్చదనం కనిపించేలా చేయాలని, నూతనంగా నిర్మించే రోడ్ల వెంట కూడా మొక్కలు నాటే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, నగర పాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, 20వ డివిజన్ కార్పొరేటర్ బి.ప్రశాంతలక్ష్మి, కార్పొరేటర్ కమర్తపు మురళి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.