ఖమ్మం రూరల్, అక్టోబర్ 10: పాలేరు నియోజకవర్గ రైతులు రాష్ర్టానికి రాజులయ్యే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మార్కెట్ ప్రాంగణంలో గురువారం జరిగింది. తొలుత జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఏఎం అలీం.. నూతన చైర్మన్ బైరు హరినాథబాబు, వైస్ చైర్మన్ వనవాసం నరేందర్రెడ్డి సహా పాలకవర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడారు. కొద్ది రోజుల్లోనే పాలేరుకు గోదావరి జలాలు రాబోతున్నాయన్నారు. రైతులు విరివిగా ఆయిల్పాఎం సాగు చేస్తే ఈ ప్రాంతంలో మరో ఫ్యాక్టరీ తీసుకొస్తామన్నారు. మద్దులపల్లి నూతన వ్యవసాయ మార్కెట్కు మంచి భవిష్యత్ ఉందన్నారు.
మద్దులపల్లి మార్కెట్ నిర్మాణం వచ్చే సంక్రాంతి నాటికి పూర్తయ్యేలా కృషి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రూ.18 వేల కోట్లతో రైతుల పంట రుణాలను మాఫీ చేశామని అన్నారు. మరో రూ.13 వేల కోట్లతో రూ.2 లక్షల పైబడిన ఉన్న రుణాలు మాఫీ చేయాల్సి ఉందని అన్నారు. ఈ నెల ఆఖరులోపు ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపనలు జరుగతాయన్నారు. నూతన రెవెన్యూ చట్టం అమల్లోకి త్వరలో వస్తుందన్నారు. రాష్ట్ర గిడ్డంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.