ఖమ్మం, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీతారామ ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేసేందుకు మరో రూ.10 వేల కోట్లు, ఐదేళ్ల సమయం కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
గత కేసీఆర్ ప్రభుత్వం వెచ్చించిన రూ.8 వేల కోట్లతో పూర్తయిన పనులతో లింక్ కెనాల్ ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు ఈ నెల 15న సీఎం రేవంత్‌రెడ్డి ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే పంపుహౌస్‌లు, పైపులైన్ల నిర్మాణం పూర్తికాగా.. రైతాంగం ఆలోచనలతో ఏకీభవిస్తూ నీటి విడుదలకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే సీతారామ ప్రాజెక్టుకు బీజం పడిందన్నారు. సీతారామ ప్రాజెక్టుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని అన్నారు. అయితే, బీఆర్ఎస్ చేసిన పనిని తాము చెప్పుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రమూ నిజం లేదని వ్యాఖ్యానించారు.
సంకుచిత మనస్కుడిని కాదు..
సత్తుపల్లి ప్రాంతానికి తక్షణమే సాగునీరు అందించేందుకు అవకాశం కలిగినందునే ఉపయోగించాం తప్ప తనకు ఒక ప్రాంతం పట్ల ప్రేమ, మరో నియోజకవర్గం పట్ల చిన్నచూపు లేదని, తాను అంతసంకుచిత మనస్కుడిని కాదని తుమ్మల స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న విషప్రచారం బాధిస్తోందంటూ ఆయన విలేకరుల సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు.
సీతారామ ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో, ఎన్ని నిధులు ఇచ్చిందో ఈనెల 15న వైరాలో సీఎం సమక్షంలో జరిగే బహిరంగ సభలో తాను చెప్పడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఇప్పటివరకు రూ.30 వేల కోట్ల మేర రుణమాఫీ కావాల్సి ఉండగా.. కేవలం రూ.18 వేల కోట్లు మాత్రమే అయిందని వివరించారు.
ఈ నెల 15న వైరాలో జరిగే సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.2 లక్షలలోపు రుణమాఫీని అధికారికంగా ప్రకటిస్తారని, రూ.2 లక్షలకు పైగా రుణం తీసుకున్న రైతుల రుణం సైతం మాఫీ కావాల్సిన అవసరం ఉందని అన్నారు. సీతారామ ప్రాజెక్టు నీటిని ఇల్లెందు ప్రాంతానికి సైతం అందించాల్సి ఉందని, లలితాపురం చెరువు ద్వారా రోళ్లపాడుకు, రోళ్లపాడు నుంచి బయ్యారానికి సీతారామ నీళ్లు అందించాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వానికి తెలియజేసినట్లు చెప్పారు. భవిష్యత్‌లో ఈ పనులు ప్రారంభమవుతాయన్నారు. విలేకరుల సమావేశంలో కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్ కమర్తపు మురళి తదితరులు పాల్గొన్నారు.